ఎమ్మెల్యే కొడుకు వార్నింగ్ తో కుటుంబం మొత్తం చచ్చిపోయారు

Update: 2022-01-04 04:17 GMT
ఒత్తిడి పెరిగిపోతున్న వేళ విచక్షణ అన్నది లేకుండా పోతుంది. దీనికి తోడు.. పెద్ద స్థాయిలో ఉన్న వారు నేరుగా రంగంలోకి దిగి బెదిరింపులకు దిగితే.. చావు మినహా మరేమీ లేదన్నట్లుగా నిర్ణయం తీసుకునే పిరికోళ్లు కొందరు ఉంటారు. తాజా ఉదంతాన్ని చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి విన్నంతనే అయ్యో అనిపించేలా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక కుటుంబం తమను తాము తగలబెట్టేసుకున్న వైనంలో తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యే తనయుడు ఉండటం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ కు చెందిన 44 ఏళ్ల నాగ రామక్రిష్ణ అలియాస్ నాగు.. భార్య శ్రీలక్ష్మీ (33).. ఇద్దరు కవలలు సాహితి, సాహిత్య (12) ఉన్నారు. మీ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఎల్ ఈడీ బల్బులు.. ఫ్యాన్ల వ్యాపారం చేసి నష్టపోయారు. కొద్ది నెలల క్రితమే ఆన్ లైన్ వ్యాపారాన్ని షురూ చేశారు. ఇందుకోసం రూ.40లక్షలు అప్పు చేశాడు. మూడునెలల క్రితమే రాజమహేంద్రవరానికి కాపురాన్ని మార్చాడు. అప్పులతో తల్లడిల్లుతున్న నాగు.. ఆస్తిలో తన వాటా తనకు ఇవ్వాలంటూ తల్లి సూర్యావతిపై ఒత్తిడి చేస్తున్నాడు.

హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఉన్న ప్లాట్ ను అమ్మితే రూ.3 కోట్లు వస్తాయని.. అందులో తన వాటా తనకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ విషయానికి సంబంధించిన పంచాయితీ పది రోజులక్రితం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్రరావు సమక్షంలో జరిగింది. ఇందులో నాగు.. ఆమె తల్లి సూర్యావతి.. సోదరి మాధవిలు ఉన్నారు. ఉమ్మడి ఆస్తిగా ఆ భూమిని ఈ నెల 5న అమ్మాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భార్య.. పిల్లల్ని తీసుకొని పాల్వంచలోని తల్లి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి వేళలో వారి మధ్య గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు.

అనంతరం తల్లి ముందు గదిలో.. మిగిలిన కుటుంబ సభ్యులంతా మరో గదిలో నిద్రపోయారు సోమవారం తెల్లవారుజామున 3.45 గంటల వేళలో ఇంట్లో నుంచి గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దం రావటంతో స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి నాగు.. అతని భార్య.. కుమార్తె సాహిత్య సజీవ దహనమయ్యారు. 80 శాతం కాలిన గాయాలతో ఆర్తనాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చిన సాహితిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవటంతో మంటలు సిలిండర్ కు వ్యాపించినట్లుగా వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా నాగు కారులో ఉన్న సూసైడ్ లెటర్ బయటకు వచ్చింది. ఆస్తి పంపకాల విషయానికి సంబంధించి జరిగిన పంచాయితీలో తల్లి.. సోదరికి మద్దతుగా ఎమ్మెల్యే కుమారుడు రాఘవేంద్రరావు నిలిచి.. తనను బెదిరించారని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

గతంలోనూ పట్టణానికి చెందిన ఒక వడ్డీ వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవటంలోనూ రాఘవేంద్రరావు కారణమని లేఖలో పేర్కొనటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తనకు ఈ ఘటనతో సంబంధం లేదని.. తానుతప్పు చేయలేదని.. రాఘవేంద్రరావు చెబుతున్నారు. తల్లిని బాగా చూసుకోవాలని తాను చెప్పానని.. రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకే తనపై ఇలాంటి విమర్శలు చేస్తున్నట్లుగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News