బీజేపీ నేతలు అసలు వ్యూహమిదేనా ?

Update: 2021-12-31 05:31 GMT
రాష్ట్రంలో బీజేపీ నేతల ధోరణులు చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఉత్తరాధి రాష్ట్రాల్లో చేసినట్లుగానే మతపరమైన విధ్వేషాలను రెచ్చగొట్టేందుకు నేతలు ప్లాన్ చేస్తున్నట్లే అనుమానాలు పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో పార్టీ బలపడాలన్నా, పదిసీట్లు గెలుచుకోవాలన్నా మతాన్ని హైలైట్ చేయటం ద్వారా మాత్రమే సాధ్యమని కొందరు నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లున్నారు. తాజాగా గుంటూరులోని జిన్నా టవర్ వివాదాన్ని తెరపైకి తేవటం ఇందులో భాగమే అన్నట్లుగా ఉంది.

హఠాత్తుగా కమలనాదులకు గుంటూరులోని జిన్నా టవర్ గుర్తుకొచ్చింది. ఢిల్లీలో కూర్చునే సత్యకుమార్ అనే నేత ఈ వివాదానికి ఆజ్యంపోశారు. దేశవిభజనకు కారకుడైన, హిందువుల ఊచకోతకు కారకుడైన మహమ్మద్ ఆలీ జిన్నా పేరుతో టవర్ ఉండేందుకు లేదంటు ట్వీట్ చేశారు.

జిన్నా టవర్ పేరును కలాం టవర్ గానో లేకపోతే గుఱ్ణంజాషువా పేరుకో మార్చాలంటు డిమాండ్ చేశారు. సత్యకుమార్ ఎప్పుడైతే డిమాండ్ చేశారో వెంటనే బీజేపీ చీఫ్ సోమువీర్రాజుతో పాటు తెలంగాణా ఎంఎల్ఏ రాజాసింగ్+విష్ణువర్ధన్ రెడ్డి లాంటి సీనియర్లు అందుకున్నారు.

వీళ్ళందరు చేసే డిమాండ్ ఏమిటంటే వెంటనే జిన్నా టవర్ పేరు మార్చకపోతే తాము టవర్నే కూలగొట్టేస్తామని వార్నింగులు కూడా ఇస్తున్నారు. వీళ్ళ వార్నింగులు పెరుగుతున్న నేపధ్యంలో ముస్లింలు కూడా అలర్టయ్యారు.

జిన్నా టవర్ పేరుమార్చినా, కూలగొట్టే ప్రయత్నం చేసినా ఊరుకునేది లేదంటు ఎదురుదాడికి దిగారు. నిజానికి జిన్నా టవర్ కట్టింది ఇపుడుకాదు 1942లో కట్టారు. ఇన్ని దశాబ్దాలుగా బీజేపీ నేతలకు గుర్తుకురాని జిన్నా టవర్ హఠాత్తుగా ఇపుడే ఎందుకు గుర్తొకొచ్చింది ?

ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందంటే చీపులిక్కర్ పై వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపింది. పార్టీపై దేశవ్యాప్తంగా నెగిటివ్ యాంగిల్లో వెళ్ళిపోయింది. దీనిలో నుండి బయటపడటం లేదా మత పరమైన విధ్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. గుంటూరులో జిన్నా టవర్ అంటే చాలా ఫేమస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఏదో రకంగా గోల చేయటం, జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్దిపొందడంపైనే బీజేపీ నేతల దృష్టి ఉందంటు ముస్లిం సంఘాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. చివరకు ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో ఏమో.


Tags:    

Similar News