అవార్డులు ఎందుకు వెనక్కిస్తున్నారో తెలుసా?

Update: 2015-10-31 08:47 GMT
దేశంలో పెరిగిపోతున్న అసహనం - విద్వేషం - మతోన్మాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ర‌చ‌యిత‌లు త‌మ జ్ఞాన‌పీఠ్ అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్నారు. సైంటిస్టులు త‌మ పుర‌స్కారాలు కేంద్ర ప్ర‌భుత్వానికి అంద‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వంపై బ‌హిరంగంగానే త‌మ అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ నిర‌స‌న‌ల‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా కేంద్ర‌ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసిన దాఖ‌లు లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు.

పద్మభూషణ్‌ పురస్కారాన్ని వెనక్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ ప్రకటించడం, అంతకుముందు కొంద‌రు సినీరంగ ప్రముఖులు తమ పురస్కారాలను వెనక్కు ఇస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో దేశంలో 'కృత్రిమ తిరుగుబాటు' పెరుగుతోందని అరుణ్‌ జైట్లీ అన్నారు. 'ముందుగా రచయితలు, ఆ తర్వాత సినీరంగ ప్రముఖులు, ఇప్పుడు శాస్త్రవేత్త... ఇదంతా ఒక గొలుసుకట్టు చర్యగా కనిపిస్తోంది. ఇది కృత్రిమ తిరుగుబాటు అని నేను ఇదివరకే చెప్పాను. దానికే నేను కట్టుబడి ఉన్నాను' అని జైట్లీ వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేకులే పురస్కారాలను వెనక్కు ఇస్తున్నారని చెప్పారు. ప‌నిలోప‌నిగా కొందరు ఈ చ‌ర్య‌ల‌ను ప్ర‌చారం చేసేందుకు మోడీ నియోజకవర్గమైన వారణాసికి వెళ్లారని అన్నారు. బీహార్‌లో ఎన్నికలు జరుగుతుండగా ఈ నిరసన పెరిగింది అని జైట్లీ వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కారు హయాంలో పెరిగిపోతున్న అసహన ధోరణులకు వ్యతిరేకంగా దాదాపు 100మందికిపైగా శాస్త్రవేత్తలు గళమెత్తారు. 'రచయితలు తమ నిరసనల ద్వారా దారి చూపారు. మేం శాస్త్రవేత్తలం వారితో గొంతు కలుపుతున్నాం' అంటూ ఆన్‌ లైన్‌ లో ఒక ప్రకటనను వారు పోస్ట్‌ చేశారు. ఈ శాస్త్రవేత్తలలో పలువురు పద్మ అవార్డు విజేతలు, ప్రముఖ శాస్త్ర, సాంకేతిక సంస్థల ప్రస్తుత, మాజీ అధిపతులు కూడా ఉన్నారు.
Tags:    

Similar News