కొంప ముంచిన కొడుకు.. వనమా పొలిటికల్ కెరీర్‌కి మచ్చ

Update: 2022-01-06 16:30 GMT
ఖమ్మం జిల్లా పాల్వంచలో ఓ వ్యక్తి కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం కొద్దిరోజులుగా తెలంగాణలో సంచనలంగా మారింది. ఖమ్మం రాజకీయాల్లాలో సౌమ్యుడిగా పేరున్న సీనియర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ వ్యవహారంలో ఇరుకునపడ్డారు. ఆయన కుమారుడు వనమా రాఘవేంద్రపై ఇందులో నేరుగా ఆరోపణలు రావడం... ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ అంతకుముందు సెల్ఫీ వీడియో తీసి అందులో రాఘవేంద్ర పేరు చెప్పడంతో పాటు తన భార్యను అప్పగించమని రాఘవేంద్ర అడిగాడని చెప్పడం సంచలనంగా మారింది.

సుమారు 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ... ఒకసారి మంత్రిగానూ పనిచేసిన వనమా తన కెరీర్‌లో సంపాదించుకున్న ఇమేజ్ అంతా రాఘవేంద్ర కారణంగా తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు. పంచాయతీలు చేయడంలో రాఘవేంద్ర స్పెషలిస్టని చెబుతున్నారు ఖమ్మం ప్రజలు. ఆస్తి గొడవలు, రియల్ ఎస్టేట్ గొడవలు పరిష్కరిస్తూ కమీషన్లు తీసుకోవడం... ఆస్తులు రాయించుకోవడం రాఘవేంద్రకు అలవాటని చెబుతున్నారు. గతంలోనూ ఆయనపై పలు కేసులున్నాయి.

తాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంలో రాఘవేంద్ర ప్రమేయం ఉందన్న ఆరోపణలతో విషయం పెద్దదైంది. ఈ వ్యవహారం ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావుకు మెడకు చుట్టుకుంటోంది. ఆయన రాజీనామా చేయాలంటూ ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ అంతటా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి సహా ఎందరో ఇప్పుడు వనమాపై మండిపడుతున్నారు. టీఆర్ఎస్ పెద్దలు కూడా ఇది పార్టీకి చెడ్డపేరు తెస్తుందన్న ఉద్దేశంతో ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికలలో తాను గెలిచి, పార్టీ కూడా గెలిస్తే మంత్రి పదవి ఖాయమని అనుకుంటున్న వనమా పొలిటికల్ కెరీర్ ఇప్పుడు ఒక్కసారిగా దెబ్బతినేసింది. 2009, 2014 ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ పక్షాన చేరి మళ్లీ విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావుపై పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో వచ్చే ఎన్నికలలోనూ విజయం తప్పదని ధీమాగా ఉన్నారు. కానీ, కొడుకు రూపంలో ఇప్పుడు పెద్ద దెబ్బే తగిలింది.

కొడుకు చేసిన తప్పుకు తండ్రిని శిక్షించకుండా పార్టీ ఆయనకు అండగా ఉంటుందా లేదంటే రాజీనామా కోరుతుందా చూడాలి.
Tags:    

Similar News