బాబు ఢిల్లీ వెళ్లినంత మాత్రాన కూట‌మి నాయ‌కుడు అయిపోతాడా?

Update: 2019-01-09 10:47 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న మ‌రోమారు వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. మంగళవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకున్నచంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం ఏపీ భవన్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  తో సమావేశం అయ్యారు.  ఏపీ భవన్‌ లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన  శరద్ పవార్ ఇంటికి వెళ్ళి ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతోనూ సమావేశం అయ్యారు.

బాబు ఢిల్లీ టూర్ ఎపిసోడ్‌ పై టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ కుమార్ బారీ సెటైర్లు వేశారు. ఢిల్లీ పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టిన బాబు నాయకుడు అయిపోతారా? అని ప్ర‌శ్నించారు. ``కాంగ్రెస్ పార్టీతో ఏపీ సీఎం చంద్రబాబు జట్టుకట్టారు. కూటమిలో కలిసిన చంద్రబాబు.. నేనే నాయకుడిని అనడం సరికాదు. నేనే కూటమిని ఏర్పాటు చేశానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు`` అని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండ‌గా, ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చంద్ర‌బాబు విలేకరులతో మాట్లాడుతూ ... దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య అనివార్యత ఉందని అన్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత  ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం అన్ని బీజేపీయేతర పార్టీలను కలుస్తున్నామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు ఇబ్బందులున్నప్పటికీ జాతీయ స్థాయిలో అందరూ కలిసి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై  కసరత్తు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జనవరి 19న కోల్ కత్తాలో జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.




Full View
Tags:    

Similar News