ఢిల్లీలో గులాబీ గ్రౌండ్ వర్క్!

Update: 2018-12-19 15:49 GMT
తెలంగాణలో పోరు ముగిసింది. అనుకున్న - ఆశించిన దానికంటే విజయం సాధించింది గులాబీ దళం. ప్రత్యర్ధులైన ప్రజాకూటమికి నిద్ర పట్టనివ్వని విజయంతో తెలంగాణ రాష్ట్ర సమితి మంచి ఊపు మీద ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంట గెలిచిన ఆనందంతో రచ్చ కూడా విజయం సాధించి రచ్చ రంబోలా అనిపించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా పావులు కదుపుతూ పలు ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇప్ప‌టికే ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ - తమిళనాడుకు చెందిన డిఎంకె అధినేత స్టాలిన్ - కర్నాటకకు చెందిన మాజీ ప్రధాని దెవేగౌడ వంటి వారిని కలిశారు.

ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులతో కూడా చేతులు కలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తనపై పని వొత్తిడి లేకుండా చేసుకుందుకు తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడ్ని చేశారు. దీని వల్ల తనపై పార్టీ పని భారం తగ్గుతుందని - ఆ సమయాన్ని జాతీయ స్ధాయి కోసం వినియోగించాలన్నది కల్వకుంట్ల వారి ఎత్తుగడ. ఇందులో భాగంగా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టగానే కె. చంద్రశేఖర రావు ఢిల్లీలో పావులు కదుపుతారని అంటున్నారు. ఆయన జనవరి మొదటి వారంలో కాని, సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత కాని ఢిల్లీ వెళ్లి పలువురు నాయకులను కలుస్తారని చెబుతున్నారు. ఈలోగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంట్ సభ్యులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. లోక్‌‌ సభ సమావేశాలు జరుగుతున్నందున అక్కడే ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌ సభ - రాజ్యసభ సభ్యులు పలు పార్టీలకు చెందిన వారిని కలిసి ఫెడరల్ ఫ్రంట్ గురించి  వివరించే పనిని చేపడుతున్నారు. ఈ పనిని పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు - వినోద్ - జితేందర్ రెడ్డి స్వయంగా నిర్వహిస్తున్నారు. ఇక జాతీయ మీడియాను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌కు అనుకూలంగా  కథనాల ప్రసారంతో పాటు తమకు ప్రచారం ఇవ్వడం వంటి అంశాలపై కూడా తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌ సభ - రాజ్యసభ సభ్యులు చేపడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత - రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ వివిధ చానెళ్లు - పత్రికల వారిని కలిసినట్లు సమాచారం. తమ అధినేత ఢిల్లీ వచ్చే లోగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి ఫెడరల్ ఫ్రంట్ కు రంగం చేసే పనిలో పడ్డారంటున్నారు.


Tags:    

Similar News