ఇప్పటికీ సీమాంధ్ర జపమే.. విషమే...

Update: 2015-10-05 11:30 GMT
తెరాస నేతలకు - మంత్రులకు - సీనియర్లకు కూడా సీమాంధ్ర భూతం ఇంకా వదిలినట్లు కనిపించడం లేదు. ప్రజాదరణతో తెలంగాణలో అధికారం కైవసం చేసుకున్న పార్టీకి ఉండాల్సిన ఆత్మవిశ్వాసం ఆ పార్టీలో ఇసుమంతయినా ఉన్నట్లు కనిపించడం లేదు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా సరే ఆ చిరుశబ్దంలో కూడా సీమాంధ్రుల పాత్ర - కుట్రను వెతుకుతున్న నేతలకు టీఆరెస్  పార్టీలో. ప్రభుత్వంలో నేటికీ కొదవలేదు. తెలంగాణలో ఎన్నడూ లేనంత అధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే వాటిని వెలికితీసే ప్రతి పత్రికా సీమాంధ్రుల మోచేతి నీళ్లు తాగేదిలాగే కనబడుతోంది ప్రభుత్వానికి.

భాగ్యనగరంలో రైతులు ఉరివేసుకుని మరణిస్తే, ఆ వార్తలు పేపర్లలో వస్తే  వాటన్నిటినీ మూకుమ్మడిగా సీమాంద్ర తొత్తులుగా అభివర్ణించడం తెలంగాణ పాలకులకే చెల్లింది. ప్రభుత్వం నుంచి జరుగుతున్న ఏ తప్పును ప్రపంచానికి చెప్పినా దాంట్లో సీమాంధుల కుట్ర కనబడుతోంది. ప్రజల కోసం పనిచేస్తున్న తమను అనుమానించడం, విమర్శించడమే ప్రజా వ్యతిరేకుల లక్షణం అంటున్న వారు ఒక అంశానికి విబిన్న కోణాలుంటాయని, వివిధ వ్యాఖ్యానాలు దాని ప్రాతిపదికపైనే తయారవుతాయన్న కనీస ఇంగితం కూడా లేకుండా వ్యవహరించడం బాధాకరం. తన వ్యతిరేక వార్తలను గంపగుత్తగా సీమాంధ్రుల కుట్రగా ఆరోపించటం అంటే ఈ ప్రభుత్వానికి, దాని మంత్రులకు తమ మీద తమకు విశ్వాసం లేనట్లే లెక్కించాల్సి ఉంటుంది.

కడియం శ్రీహరి వంటి సీనియర్ మంత్రులు, కేటీఆర్ వంటి పరమ దూకుడు నేతలూ ఇందుకు సంబంధించి ఒకే బాటలో నడుస్తున్నారంటే రాష్ట్ర విభజన జరిగి 15 నెలల తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వానికి సీమాంధ్ర ఫోబియా వీడలేదనిపిస్తోంది. ప్రభుత్వం చేతకానితనం -  నిర్లక్ష్యం - అసమర్థత -  దందాలు - బెదిరింపులు కనబడుతున్నా వాటిని ఎవరూ ప్రశ్నించకూడదంటే, విమర్శించకూడదంటే ఇది తెలంగాణ ప్రజాస్వామ్య లక్షణమేమో అనిపించకమానదు.

సీమాంధ్ర ఫోబియానుంచి తెలంగాణ నాయకత్వం ఎంత త్వరగా బయటపడి తన పని తాను చిత్తశుద్ధితో చేసుకుపోతే వారికి అంత మంచిది. పైగా వారి ప్రజాదరణకు వచ్చిన నష్టమేం లేదు. కానీ పాడిందే పాటరా చందాన అరిగిపోయిన పాటను మళ్లీ మళ్లీ పాడుతుంటే  ఆదరించిన ప్రజలే చీకొట్టే రోజులు రాకమానవు. ఇప్పటికే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టే మంత్రులు, నేతలూ గంగవెర్రులెత్తినట్లు వ్యవహరిస్తున్నాయోమో మరి.
Tags:    

Similar News