ఎమ్మెల్సీకి ఎక్కువ.. రాజ్యసభకు తక్కువంట!

Update: 2015-07-01 05:02 GMT
సీనియర్‌ కాంగ్రెస్‌ నేత..ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీకి సారథ్యం వహించిన ధర్మపురి శ్రీనివాస్‌ చేతిని వదిలేసి.. కారులో ఎక్కేందుకు సిద్ధం కావటం తెలిసిందే. ఆయన పార్టీ మారతారన్న వాదన రెండు రోజులుగా వినిపిస్తున్నదే. మంగళవారం మరింత స్పష్టతనిస్తూ.. తాను పార్టీ మారటం ఖాయమన్న విషయాన్ని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాయటం తెలిసిందే.

తనను ఎన్నో అవమానాలకు గురి చేశారని.. తనకు ఇచ్చిన మాట ప్రకారం పార్టీ ఎప్పుడూ నడుచుకోలేదని.. అందుకే తాను పార్టీ మారుతున్నట్లుగా డీఎస్‌ పేర్కొనటం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీకి సారథ్య సమస్యలు ఎదురుకావటం.. సరైన నేత లేకపోవటంతో పార్టీ పరిస్థితి అంత బాగా లేని నేపథ్యంలో డీఎస్‌ పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఒకవేళ కష్టపడినా.. రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో పలు సందేహాలు నెలకొని ఉండటంతో ఆయన పార్టీ మారాలని ఆలోచిస్తున్నట్లుచెబుతున్నారు. అధిష్ఠానం దూత డిగ్గీరాజాతో సంబంధాలు అంత సరిగా లేకపోవటం.. ఎమ్మెల్సీ పోస్ట్‌ ఇచ్చే విషయంలోనూ అధినాయకత్వం సముఖంగా లేని నేపథ్యంలో పదవి లేకుండా అవమానాలు పడే కన్నా.. పార్టీ మారటమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

తమ పార్టీలో గౌరవానికి.. మర్యాదకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటామన్న మాటతో పాటు.. ఎమ్మెల్సీ పదవి అయితే ఇప్పటికిప్పుడు.. రాజ్యసభ సభ్యత్వం అయితే ఏడాది తర్వాత ఇచ్చేలా కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు.. టీఆర్‌ఎస్‌ పార్టీలో డీఎస్‌కు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. డీఎస్‌ ఎమ్మెల్సీకి ఎక్కువని.. రాజ్యసభకు తక్కువని అలాంటి నేత పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందా? అని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. అధినేత నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేని నేతలు.. ఇలాంటి వ్యాఖ్యల్ని లోగుట్టుగా చేయటం గమనార్హం.

Tags:    

Similar News