ఎమ్మెల్సీపై వేటు...కాంగ్రెస్‌ కు కేసీఆర్ షాక్‌

Update: 2018-11-23 06:22 GMT
టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క స‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారా? త‌న‌కు ఇబ్బంది క‌లిగించేలా ప‌రిస్థితులు మారుతున్న క్ర‌మంలో ఆయ‌న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఒక‌టి తీసుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది తాజా ప‌రిణామాలు గ‌మ‌నిస్తుంటే. ఎమ్మెల్సీ కె. యాదవరెడ్డిని టీఆర్ ఎస్ పార్టీ నుండి బహిష్కరించారు. ఈ మేరకు టీఆర్ ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. అయితే, ఈ ఎపిసోడ్ వెనుక ప‌లు కీల‌క ప‌రిణామాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. నేడు కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియాగాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న‌ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన బాటలోనే మరికొందరు నేతలు వెళ్తున్నారనే ప్రచారం జ‌రిగింది. ఇదే స‌మ‌యంలో వికారాబాద్ జిల్లా వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన తాజా మాజీ  ఎమ్మెల్యే సంజీవరావు... టీఆర్ ఎస్‌ కు రాజీనామా చేశారు. టీఆర్‌ ఎస్‌ అధిష్టానం వికారాబాద్‌ టీఆర్‌ ఎస్‌ టికెట్‌ ను డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ కు కేటాయించింది. అనారోగ్య కారణాలతో తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్‌ నిరాకరించింది. దీంతో టీఆర్ ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు సంజీవరావు... అభ్యర్థి విషయంలో నన్ను సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన... నన్ను పార్టీ గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతానని ప్రకటించారు.

ఈ ఇద్ద‌రు నేత‌ల అనంత‌రం పార్టీకి గుడ్‌ బై చెప్పేది యాద‌వ‌రెడ్డి అని ప్ర‌చారం జ‌రిగింది. టీఆర్ ఎస్ పార్టీలోని ప‌లు ప‌రిణామాల‌పై అసంతృప్తిగా ఉన్న యాద‌వ‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హిస్తున్న స‌భ‌లో సోనియాగాంధీ స‌మ‌క్షంలో ఆ పార్టీలో చేర‌నున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ముందే అల‌ర్ట్ అయ్యారు. స‌రిగ్గా స‌భ జ‌రిగేందుకు కొన్ని గంట‌ల ముందు ఆయ‌న‌పై బ‌హిష్క‌ర‌ణ‌ వేటు వేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అయిన యాద‌వ‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ ఎస్‌ లో చేరారు. అనంత‌రం ఆయ‌న‌కు పార్టీ ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించింది
Tags:    

Similar News