కేసీఆర్‌ను లైట్‌ గా తీసుకున్నారా..?

Update: 2019-11-06 04:50 GMT
సీఎం కేసీఆర్‌ను ఆర్టీసీ కార్మికులు లైట్‌ గా తీసుకున్నారా..? ఆయ‌న విధించిన గ‌డువును ఎవ‌రూ లెక్క చేయ‌లేదా..? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఈనెల 5వ తేదీ అర్ధ‌రాత్రిలోగా విదుల్లో చేరాయ‌ల‌ని సీఎం కేసీఆర్ విధించిన గ‌డువు ముగిసింది. అయితే.. ఆయ‌న గ‌డువు విధించిన మూడు రోజుల్లో కేవ‌లం 22 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో మ‌రి కొంద‌రు తిరిగి స‌మ్మెలో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. అంటే కేసీఆర్ విధించిన గ‌డువును ఆర్టీసీ కార్మికులు ఖాత‌రు చేయ‌లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

దీంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌తోపాటు సామాన్య ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ కార్మికుల కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతోంది..? త‌న పంతాన్ని నెగ్గించుకునేందుకు సీఎం కేసీఆర్ వ్యూహం ఎలా ఉండ‌బోతోంది..? అన్న దాని పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి.. ఈ నెల 5వ తేదీలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేర‌కుంటే..మ‌రో ఐదువేల బ‌స్సుల‌ను కూడా ప్రైవేట్ ప‌రం చేస్తామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.

అయితే ఉద్యోగులను తొలగించి, సంస్థను నిర్మూలించే అధికారం ముఖ్యమంత్రికి లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మ‌న్ అశ్వ‌త్థామ‌రెడ్డి చెబుతున్నారు. సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్‌ను కార్మికులు ఎమాత్రం లెక్క‌చేయ‌కుండా స‌మ్మె కొన‌సాగించ‌డంతో అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ అంత‌ర్మ‌థ‌నం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ విధించిన డెడ్‌లైన్‌తో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతార‌ని, దీంతో స‌మ్మెను కార్మికులు త‌మంట‌తామే విర‌మిస్తార‌ని గులాబీ నేత‌లు అనుకున్నారు. కానీ, ఆర్టీసీ కార్మికులు ప‌ట్టు వీడ‌లేదు. మెట్టుదిగ‌లేదు.

చర్చలపై  ప్రభుత్వం తరుపు నుంచి ఎలాంటి హామీ రాకుండా విధుల్లో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అధినేత వ్యూహం బెడిసికొట్ట‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని గులాబీ శ్రేణులు లోలోప‌ల‌ ఆందోళ‌న చెందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లువురు పార్టీ నేత‌లు, ప్ర‌భుత్వం లోని కొంద‌రు కీల‌క వ్య‌క్తులు కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ మరొక విష‌యం ఏమిటంటే.. సీఎం కేసీఆర్ క‌న్నా ఆర్టీసీ కార్మికులు త‌మ యూనియ‌న్ల నేత‌ల‌నే న‌మ్ముతున్నార‌ని, కేసీఆర్ మాట‌ల‌ను న‌మ్మ‌డం లేద‌ని గుస‌గుస‌లాడుకోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News