తెలంగాణ టీడీపీకి మళ్లీ ఉత్సాహం

Update: 2015-09-08 18:29 GMT
రెండు మూడు నెలలుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనంత స్తబ్ధుగా ఉన్నారు. ప్రభుత్వ విధానాలపై ఒక ప్రకటన లేదు. ఒక ఆందోళన లేదు. ఒక ధర్నా లేదు. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? లేకపోతే విజయవాడకు వెళ్లిన చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి పార్టీని కూడా తీసుకుపోయాడా అన్నంత స్తంబ్ధత ఆ పార్టీలో ఆవరించింది. ఆ పార్టీ నేతలు అధికార టీఆర్ఎస్ కు, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయపడుతున్నారో లేక ప్రభుత్వంపై ఆందోళన చేయడానికి ఆ పార్టీకి ఒక్క అంశం కూడా కనిపించలేదో తెలియనంతగా మౌనంగా ఉన్నారు.

అయితే, ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కూడా కొత్త ఉత్సాహం వస్తోంది. తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డికి కోర్టు వెసులుబాటు కల్పించడమే ఇందుకు కారణం. ఇక ఆయన తన నియోజకవర్గానికే పరిమితం కావాల్సిన పని లేదని, ఎక్కడికైనా వెళ్లవచ్చని, కేసు విషయం తప్ప ఏమైనా మాట్లాడవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దాంతో అసెంబ్లీ సమావేశాల ముందర, కేసీఆర్ పై అయినా, ప్రభుత్వంపై అయినా విరుచుకుపడేది రేవంత్ రెడ్డేనని, ఇప్పటికే కేసీఆర్ మీద ఆగ్రహంతో ఉన్న ఆయన ఇప్పుడు మరింత రెచ్చిపోతారని ఆ పార్టీ నాయకులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.

నిజానికి, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి మినహా అధికార పార్టీపై పోరాడేవాళ్లు.. కేసీఆర్ పై విరుచుకుపడేవాళ్లు దుర్భిణి పెట్టి వెతికినా కనిపించడంలేదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అడపాదడపా ప్రకటనలు చేసినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడని, మిగిలిన నాయకులు పత్రికా ప్రకటనలకు తప్ప ఆందోళనలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో పేరుకుపోయింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తిస్తుంటే అధికార పార్టీపై మరింత ఒత్తిడి పెంచడానికి తాము కూడా ఆందోళనలు చేయాల్సి ఉందని, కానీ పార్టీ నేతల వైఖరి కారణంగా పార్టీ ఉందో లేదో అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News