వనమా రాఘవ అరెస్టులో అదిరే ట్విస్టు.. ఏఎస్పీ ప్రకటనతో కొత్త క్వశ్చన్లు

Update: 2022-01-07 03:43 GMT
ఒక సామాన్యుడి కుటుంబం మొత్తంగా ఆత్మహత్య చేసుకోవటం.. మొదట్లో కుటుంబ ఆస్తి తగాదాలు అనుకున్న దాని స్థానే.. సదరు వ్యక్తి భార్యను కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు తన వద్దకు పంపమని కోరటంతో.. బతకలేక చచ్చిపోతున్నట్లుగా చెప్పిన సెల్ఫీ వీడియో పెను సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనల్ని రేపుతోంది. ఈ ఉదంతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రను కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇదంతా ఒక ఎత్తుఅయితే.. అనూహ్యంగా గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ చేసిన ప్రకటన ఇప్పుడు మరో సంచలనంగా మారింది. హైదరాబాద్ లో అరెస్టు చేసినట్లుగా జరిగిన ప్రచారానికి భిన్నంగా.. అసలు రాఘవేంద్రను అరెస్టు చేయలేదని పోలీసు అధికారి చేసిన ప్రకటన కొత్త గందరగోళానికి గురయ్యేలా చేసింది. మరి.. గురువారం మధ్యాహ్నం నుంచి రాఘవేంద్రను అరెస్టు చేసినట్లుగా వచ్చిన వార్తల మాటేంటి? ఒకవేళ.. నిజంగానే అరెస్టు చేయని పక్షంలో.. టీవీల్లో పడుతున్న బ్రేకింగ్ న్యూస్ ను చూసైనా సరే.. అరెస్టు చేయలేదని.. తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతుందన్న ప్రకటన చేయాలి కదా?

అలాంటిదేమీ చేయకుండా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అరెస్టు చేయలేదన్న చావు కబురు చల్లగా చెప్పటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రధాన మీడియాసంస్థలు అన్నింటిలోనూ వచ్చిన వార్తా కథనాల్ని చూసినప్పుడు.. హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో కానీ.. బషీర్ బాగ్ లోని ఎన్ఎస్ఎస్ వద్ద కానీ వనమా రాఘవేంద్ర ప్రెస్ మీట్ పెట్టి.. తన వాదనను వినిపించాలని సిద్ధమవుతున్న వేళ.. కొత్తగూడెం పోలీసులు వచ్చి ఆయన్ను అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

అంతేకాదు.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు స్వయంగా తన కొడుకును పోలీసులకు అప్పగించినట్లుగా కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాదు.. అతడి మీద ఐపీసీ సెక్షన్ 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు భిన్నంగా వనమా రాఘవేంద్రను అసలు అరెస్టు చేయలేదంటూ పాల్వంచ ఏఎస్పీ అధికారిక ప్రకటన చేయటం ఇప్పుడు కొత్త గందరగోళానికితెర తీస్తోంది. ఇదే మాటలను వనమా రాఘవేంద్రను అరెస్టు చేసినట్లుగా టీవీ చానళ్లు బ్రేకింగ్ న్యూస్ లు వేసినంతనే చెప్పకుండా.. ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్పినట్లు? ఎందుకీ గందరగోళం చోటు చేసుకుంది? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.


Tags:    

Similar News