అస‌లీ ప్ర‌బోధానంద ఎవ‌రు?ఆయ‌నేం చేస్తుంటారు?

Update: 2018-09-18 06:30 GMT
గ‌డిచిన నాలుగైదు రోజులుగా అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో చోటు చేసుకున్న హింసాత్మ‌క కార్య‌క్ర‌మాలు.. జేసీ లాంటి నేత రోడ్ల మీద‌కు వ‌చ్చి బ‌స్తీమే స‌వాల్ అంటూ విరుచుకుప‌డ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌బోధానంద పేరు ఒక‌టి త‌ర‌చూ వినిపిస్తోంది. తాడిప‌త్రిలో చోటుచేసుకున్న హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు ఒక‌రు బ‌లి కావ‌టం ఒక ఎత్తు అయితే.. అస‌లీ వివాదానికి కాఱ‌ణంగా చెబుతున్న ప్ర‌బోధానంద ఎవ‌రు? ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

తాడిప‌త్రిలో తాజాగా చోటు చేసుకున్న హింస‌కు.. ఒక‌రి మ‌ర‌ణానికి.. ప‌లువురికి గాయాలు కావ‌టానికి కార‌ణంగా చెబుతున్న ప్ర‌బోధానంద గ‌తంలోకి వెళితే.. ఆయ‌న్ను ఒక ఆర్ ఎంపీ డాక్ట‌ర్ గా ప‌లువురు గుర్తు చేస్తుంటారు. అనంత‌పురం జిల్లా పెద్ద‌ప‌ప్పూరు మండ‌లం అమ్మ‌ళ్ల‌దిన్నె కొత్తప‌ల్లిలో 1950లో పుట్టిన ప్ర‌బోధానంద‌.. బాల్యం నుంచి ఆధ్యాత్మికంపై ఎక్కువ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించేవారు.

తాడిప‌త్రిలో ఆర్ ఎంపీ డాక్ట‌ర్ గా కొంత‌కాలం సేవ‌లు అందించిన ఆయ‌న 1978లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కొత్త‌కోట‌లో త్రైత సిద్దాంత ఆశ్ర‌మాన్ని ప్రారంభించారు. అక్క‌డ భ‌క్తులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్న ఆయ‌న తిరిగి తాడిప‌త్రికి వ‌చ్చేశారు.

1991లో రాజీవ్ గాంధీ హ‌త్య త‌ర్వా త జ‌రిగిన అల్ల‌ర్ల‌లో ప‌లువురు బీజేపీ నేత‌లు.. మ‌ద్ద‌తుదారుల‌కు ఆశ్ర‌యం ఇచ్చార‌న్న పేరుంది. ఈ క్ర‌మంలోనే జేసీ బ‌ద్రర్స్ తో విభేదాలు స్టార్ట్ అయ్యాయ‌ని చెబుతారు. ఈ విభేదాలు అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టంతో ఆయ‌న త‌న మకాంను అనంత‌పురానికి మార్చారు.

2001లో తాడిప‌త్రి మండ‌లం చిన్న‌పొల‌మ‌డ‌లో చిన్న‌రేకుల షెడ్డులో ఆశ్ర‌మాన్ని స్టార్ట్ చేసిన ప్ర‌బోధానంద అంచెలంచెలుగా ఎదిగి.. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌.. మ‌హారాష్ట్రతో పాటు అమెరికా.. బ్రిట‌న్ దేశాల‌కూ త‌న భ‌క్తులను విస్త‌రించారు.

పేరు ఎంత వ‌చ్చిందో.. దాంతో పాటు వివాదాలు అంతే ఎక్కువ‌గా ఆయ‌న్ను చుట్టి ముట్టాయి. తన ర‌చ‌న‌ల్ని ప్రింట్ చేయ‌టానికి వీలుగా కోట్లాది రూపాయిల ప్రింటింగ్ మిష‌న‌రీని ఆశ్ర‌మంలో ఏర్పాటు చేయ‌టం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న రాసిన 97 పుస్త‌కాలు వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంటాయి. 

హిందూ దేవ‌త‌ల‌తో పాటు.. ఖురాన్‌.. బైబిల్ ను వ‌క్రీక‌రించి ర‌చ‌న‌లు చేయ‌టంతో ఆయా మ‌త‌స్తులు ప్ర‌బోధానందపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. ఆధ్యాత్మిక కేంద్రం ముసుగులో అక్ర‌మ నిర్మాణాలు సాగుతున్నాయ‌న్న ఆరోప‌న‌లు ఉన్నాయి. ఆయ‌న నిర్మించిన నిర్మాణాల్ని కూల్చివేయాల‌ని  జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీస‌ర్ 2017లో చిన్న‌పొల‌మ‌డ పంచాయితీ కార్య‌ద‌ర్శిని ఆదేశించిన‌ట్లుగా చెబుతారు. ప‌లుకుబ‌డి ఉన్న ప్ర‌బోధానంద‌ను ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ ఏమీ చేయ‌లేక‌పోయారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌రి అన్ని మ‌తాల్ని త‌న‌దైన రీతిలో భాష్యాలు చెప్పే ఈ పెద్ద‌మ‌నిషి.. ఎవ‌రిని కొలుస్తార‌న్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. శ్రీ‌కృష్ణుడే త‌న దేవుడిగా ఆయ‌న చెబుతారు. కృష్ణుడు త‌ప్పించి మ‌రో దైవం లేర‌ని చెప్పే ప్ర‌బోధానంద ప్ర‌చారం జోరుగా సాగుతుంటుంది. ప్ర‌తి పౌర్ణ‌మికి ఆశ్ర‌మంలో పెద్ద ఎత్తున ప్రార్థ‌న‌లు చేస్తుంటారు. దీనికి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తుంటారు. ప్ర‌తి కృష్ణాష్ట‌మి వేడుక‌లకు ఇత‌ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు వ‌స్తుంటారు.

అన‌ధికారిక స‌మాచారం ప్ర‌కారం ఆశ్ర‌మంలో  దాదాపు వెయ్యి నుంచి ప‌దిహేను వంద‌ల వ‌ర‌కు గ‌దులు ఉన్న‌ట్లుగా చెబుతారు. ఐదు వేల మంది కూర్చోవ‌టానికి వీలుగా విశాల‌మైన గ‌దిని నిర్మించార‌ని చెబుతారు. ఆయ‌న్ను నేరుగా క‌లుసుకోవ‌టం కొంద‌రికి మాత్ర‌మే సాధ్య‌మ‌ని.. అంద‌రికి ఆయ‌న అపాయింట్ మెంట్ ఇవ్వ‌ర‌ని చెబుతుంటారు.
Tags:    

Similar News