'4' బడ్జెట్ లకు భిన్నంగా .. కేవలం 90 నిమిషాల్లో క్లోజ్ చేశారు

Update: 2022-02-02 04:30 GMT
తెలుగింటి కోడలు కమ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రి హోదాలో నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆమె.. గతానికి భిన్నంగా వ్యవహరించారు. గతంలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రసంగించిన ఆమె ప్రసంగాలు.. గతం కంటే చాలా తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయటం విశేషం. తన తొలి బడ్జెట్ ను 2019లో తొలిసారి ప్రవేశ పెట్టారు. అప్పట్లో ఆమె బడ్జెట్ ప్రసంగం రెండుబావు గంటలపైనే తీసుకున్నారు.

ఈసారి మాత్రం అందుకు భిన్నంగా.. కేవలం డబుల్ డిజిట్ ను దాటకుండానే తన బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేశారు. గత ఏడాదితో పోల్చినా కూడా తక్కువ సమయాన్నే తన బడ్జెట్ ప్రసంగం కోసం కేటాయించిన ఆమె.. కేవలం 90 నిమిషాల్లోనే పూర్తి చేయటం విశేషం. గత ఏడాది మాదిరే ఈ ఏడాది సైతం పేపర్ లెస్ గా బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆమె.. అతి తక్కువ వ్యవధిలోనే పూర్తి చేశారు.

ఉదయం 11 గంటలకు మొదలైన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. కేవలం తొంభై నిమిషాల్లోనే పూర్తి అయ్యింది. పన్నెండున్నర అయ్యేసరికి ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసి తన సీట్లో కూర్చున్నారు. పార్లమెంటులోనాలుగోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆమె.. తన గత బడ్జెట్ ప్రసంగాలకు భిన్నంగా చాలా తక్కువ వ్యవధిలోనే పూర్తి చేశారు.

2019లో ప్రవేశ పెట్టిన తన మొదటి బడ్జెట్ ను 137 నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె.. ఆ తర్వాతి ఏడాది 2020లో 162 నిమిషాల పాటు ప్రసంగించారు. గత ఏడాది (2021)లో మాత్రం ఆమెతన బడ్జెట్ ప్రసంగాన్ని 110 నిమిషాలకు కుదించారు. ఈసారి మరింత తక్కువ సమయాన్ని మాత్రమే తీసుకున్న ఆమె.. గంటన్నరలోనే పూర్తి చేశారు. 2003లో నాటి కేంద్రమంత్రిగా వ్యవహరించిన జస్వంత్ సింగ్ చేసిన 135 నిమిషాల బడ్జెట్ ప్రసంగ సమయాన్ని నిర్మలమ్మ 2020లో అధిగమించారు. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాన్ని చేసిన మంత్రిగా నిలిచారు. తాజాగా తక్కువ వ్యవధిలోనే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.

1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్ ఎం.పటేల్ అతి తక్కువ టైంలో బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన ఆర్థికమంత్రిగా రికార్డును నెలకొల్పారు. ఏమైనా.. తన గత బడ్జెట్ ప్రసంగాల కంటే తక్కవ వ్యవధిలో పూర్తి చేయటం విశేషం.
Tags:    

Similar News