తెలుగు రాష్ట్రాల సీఎంలు.. యూపీ ముఖ్యమంత్రి తాజా ఆదేశాల్ని తెలుసుకోండి

Update: 2022-04-14 03:28 GMT
అత్యున్నత పదవులు పవర్ కు సెంట్రల్ గా మారటం కాదు.. మరింత ఒళ్లు వంచి పని చేసేందుకన్న భావన రాజకీయాల్లో రావటంఅసాధ్యమనిపిస్తుంది. అధికారాన్నిఒక అభరణంగా చూసే రోజుల్లో దాన్ని మరింత బాధ్యతగా నిర్వహించాలన్న మాట ముఖ్యమంత్రి నోటి నుంచి రావాలనుకోవటం అత్యాశే అవుతుందేమో.

అందునా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి తీరు అస్సలు సాధ్యమే కాదేమో? చేతిలోకి ఏ చిన్న పదవి వచ్చినా.. తమ హవా నడిపేందుకు చూపించే ఉత్సాహం.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించటం పెద్దగా కనిపించదు. ఇలాంటివేళలో.. పాలనాపరంగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా పలు సంచలన నిర్ణయాల్ని తీసుకోవటమే కాదు.. తాజాగా దిశానిర్దేశం చేశారు.

తన మంత్రివర్గంలోని మంత్రులు.. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికార పర్యటనల్లో స్టార్ హోటళ్లలో బస చేయటం.. విలాసంగా ఉండటం చూస్తుంటాం. ఇలాంటివాటికి ఆయన తాజాగా చెక్ పెట్టేశారు.హోటళ్లకు బదులుగా ప్రభుత్వ గెస్టు హౌస్ ల్లోనే బస చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు.. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తమ బంధువుల్ని.. దగ్గరి వారిని కార్యదర్శకులుగా ఎంపిక చేసుకోవటం అన్ని చోట్ల ఉన్నదే. కానీ.. అలాంటివి చేయకూడదంటూ మంత్రులకు స్పష్టం చేశారు.

ఇక.. అధికారులు సమయానికి ఆఫీసులకు రావాలని.. లంచ్ బ్రేక్ సమయాన్ని కచ్ఛితంగా 30 నిమిషాలన్న విషయాన్ని తప్పక పాటించాలని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ బ్రేక్ మధ్యాహ్నం ఒంటిగంటన్నర నుంచి రెండు గంటల వరకు ఉంటుంది.

కానీ.. కొందరు లంచ్ బ్రేక్ తర్వాత చాలా ఆలస్యంగా ఆఫీసులకు వస్తుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు అరగంట మాత్రమే మధ్యాహ్న భోజన విరామ సమయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేయటంతో పాటు.. సదరు ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.

అంతే కాదు.. ఆఫీసులకు ఆలస్యంగా వచ్చే అధికారుల పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్టర్ ను విధిగా అమలు చేయాలన్న ఆయన.. అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రాకుంటే వారిని విధుల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. అంతేకాదు..ఏ ఫైలూ ఏ అధికారి వద్దా మూడు రోజులకు మించి పెండింగ్ లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాల్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడు అమలు చేస్తారో ఏమో?
Tags:    

Similar News