తోక జాడించిన 40 మంది తోక కత్తిరించిన బీజేపీ

Update: 2019-09-30 05:00 GMT
ఏమైనా చేయొచ్చన్నట్లుగా కొన్ని పార్టీల తీరు ఉంటుంది. తోక జాడించిన పార్టీ నేతల విషయంలో చర్యలు తీసుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తే.. మరికొన్ని పార్టీలు మాత్రం అందుకు భిన్నంగా కర్కసంగా వ్యవహరిస్తుంటాయి. తాజాగా తీసుకున్న చర్యలతో తాము రెండో కోవకు చెందిన వారిమన్న విషయాన్ని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

తోక జాడించిన పార్టీ నేతల విషయంలో కఠినంగా వ్యవహరించిన బీజేపీ.. తాజాగా భారీ హెచ్చరికను జారీ చేసిందని చెప్పాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా ఏకంగా 40 మంది బీజేపీ నేతలపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన 40 మంది బీజేపీ నేతలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేశారు. ఇలాంటివేళ.. చర్యలు తీసుకోవటానికి వెనుకా ముందు ఆడుతుంటాయి పార్టీలు. అందుకు భిన్నంగా పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసిన 40 మంది నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారి స్థానంలో పార్టీ పదవుల్లో వేరే వారిని నియమించనన్నట్లుగా ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర భండారీ వెల్లడించారు. తాజా చర్యతో గట్టి సందేశాన్ని పంపటమే కాదు.. తోక జాడిస్తే.. మొత్తంగా కత్తిరించి వేయటానికి తాము వెనుకాడమన్న సంకేతాన్నిపార్టీ ఇచ్చినట్లైందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News