అదేంది వాణి..మ‌రి తెలంగాణ మీద అభిమానం లేదా?

Update: 2017-11-13 10:22 GMT
సినిమా డైలాగులు చెప్పినంత ఈజీగా పొలిటిక‌ల్ మాట‌లు చెప్పలేర‌న్న విష‌యాన్ని నాటి న‌టి వాణీ విశ్వ‌నాధ్‌కు తెలీదేమో? ఏపీ విప‌క్ష  ఫైర్ బ్రాండ్ రోజా ధాటికి తెలుగు త‌మ్ముళ్లు ఎంత‌లా ఇబ్బంది ప‌డ‌తారో తెలిసిందే. ఇలాంటి వేళ‌.. త‌మ‌కూ అలాంటి ఫైర్ బ్రాండ్ కావాల‌న్న డిమాండ్ ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో ఉన్న‌దే. మాట‌కారిత‌నం.. సినిమా గ్లామ‌ర్ తోపాటు వేగంగా దూసుకెళ్లే త‌త్త్వం ఉన్న మ‌హిళా నేత కోసం చేస్తున్న వెతుకులాట వాణీ పుణ్య‌మా అని పుల్‌ స్టాప్ ప‌డిన‌ట్లే.

సినిమా అవ‌కాశాలు త‌గ్గుముఖం పెట్టిన త‌ర్వాత తెర‌మ‌రుగైన వాణీ పెళ్లి చేసుకుని  త‌న‌దైన జీవితంలో బిజీగాఉంది. ఉన్న‌ట్లుండి ఆమెకు రాజ‌కీయ ఆలోచ‌న‌లు వ‌చ్చాయి. అంతే.. మీడియా ముందుకు వ‌చ్చి తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ కావాల‌న్న అభిలాష‌ను వ్య‌క్తం చేశారు. ప‌నిలో ప‌నిగా టీడీపీ అంతే త‌న‌కున్న అభిమానాన్ని ప్ర‌క‌టించారు.

ఇంకేం ఉంది..  తాము కోరుకున్న మ‌హిళానేత‌గా వాణీవిశ్వ‌నాధ్ అచ్చుగుద్ది స‌రిపోతార‌న్న భావ‌న తెలుగు త‌మ్ముళ్ల‌లో ఏక‌గ్రీవంగా వ్య‌క్త‌మైంది. త్వ‌ర‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. తాజాగా ఒక ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టానికి అనంత‌పురం వ‌చ్చిన వాణీ మీడియాతో మాట్లాడారు.

మాట్లాడింది కాసేపే అయినా.. మాట‌ల కంటే స్పీడ్ గా చేతులు ఊపేస్తూ మాట్లాడిన ఆమె.. త‌న‌కున్న వాగ్దాటిని ప్ర‌ద‌ర్శించారు. అంత‌వ‌ర‌కు బాగున్నా.. ఆమె చెప్పిన మాట‌లే ఇబ్బందిగా ఉన్నాయ‌ని చెప్పాలి. అనంత‌పురం ప్ర‌జ‌లు చూపించే అభిమానాన్ని తాను ఎన్న‌టికి మ‌ర్చిపోలేన్నారు. త్వ‌ర‌లోనే టీడీపీలోకి చేర‌నున్న‌ట్లుగా చెప్పిన ఆమె.. పార్టీలో ఎలాంటి పాత్ర పోషించాల‌న్న అంశంపై.. అధినేత ఏం చెబితే ఆ ప‌ని చేస్తానంటూ చెప్పేశారు.

రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ బ‌రిలో ఉంటాన‌న్న విష‌యాన్ని చెప్పేసిన ఆమె.. తాను ఎక్క‌డి నుంచి బ‌రిలో దిగాల‌న్న విష‌యాన్ని కూడా అధినేతే డిసైడ్ చేస్తార‌న్నారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌న్న ఆశ ఎంతోకాలంగా ఉంద‌ని.. తెలుగు ప్ర‌జ‌ల మీద అభిమానంతోనే తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు. ఒక‌వేళ తాను రాజ‌కీయాల్లో రాకున్నా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చేదానిన‌ని చెప్పారు. అంతాబాగానే ఉంది కానీ.. తెలుగువాళ్ల మీద అభిమానం అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల మీద చూపించాలే కానీ.. ఆంధ్రాకే ప‌రిమితం అవుతాన‌న్న‌ట్లుగా ఎందుకు చెప్పిన‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఆంధ్రా ప్ర‌జ‌లు ఎంత‌గా అభిమానించారో.. తెలంగాణ ప్ర‌జ‌లు సైతం వాణిని అంత‌గానే అభిమానించి.. ఆరాధించారు. మ‌రి.. ఏపీకే వాణి ప‌రిమితం అవుతాన‌ని చెప్ప‌టం గ‌మ‌నించారా? ఇన్ని మాట‌లు చెప్పే వాణి.. ఏపీతో త‌న‌కున్న అభిమానాన్ని అతికేలా చెప్పి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News