బాబు దొంగ లెక్క‌ల‌తోనే నిధులు రావ‌ట్లే!

Update: 2016-12-14 04:18 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బీజేపీ నేతలు కీలుబొమ్మలుగా మారారని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మండిప‌డ్డారు. బీజేపీకి రాజీనామా చేసిన అనంత‌రం  లోటస్‌ పాండ్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి విలేక‌రుల‌తో మాట్లాడుతూ చంద్రబాబు చేతిలో ఆంధ్ర బీజేపీ నేతలు కీలుబొమ్మలుగా మారిపోయి తానా అంటే తందానా అంటున్నార‌ని  మండిప‌డ్డారు. ఏపీలో బీజేపీకి మనుగడ లేదని, ఆ పార్టీ నేతలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానివేశారన్నారు.ఎన్నికల హామీలను అమలు చేయడంలో బీజేపీ-టీడీపీలు పూర్తిగా విఫలం అయ్యాయని వెల్లంప‌ల్లి మండిప‌డ్డారు.

త‌మ‌కు మిత్రపక్షమే అయిన‌ప్ప‌టికీ  కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వమే చంద్రబాబు తీరును అనుమానిస్తోందని వెల్లంప‌ల్లి తెలిపారు. చంద్రబాబు చూపెట్టే దొంగలెక్కల వల్ల ఏపీకి న్యాయం జరగడం లేదని ఆయ‌న మండిప‌డ్డారు. కేంద్రం ఇచ్చే నిధులకు సరిగ్గా లెక్కలు చెప్పడం లేదని, అందుకే కేంద్రం ఆంధ్రాకు నిధుల మంజూరు చేయడం లేదని విమ‌ర్శించారు. రాష్ట్ర విభజనకు, పెద్దనోట్ల రద్దుకు ముందుగా లేఖ రాసిన నేత చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఆ తర్వాత మాట మార్చిన ఘనత కూడా బాబుదేనని ఎద్దేవా చేశారు. కోస్తా- రాయలసీమ జిల్లాల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

వైకాపా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్న‌ చంద్ర‌బాబు ప‌రిపాల‌న తీరును అంతా గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని మాయమాటలు చెప్పి చంద్రబాబు తన పార్టీలో వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని విమ‌ర్శించారు. వైకాపా సీనియర్ నేత పార్థసారథి మాట్లాడుతూ - బందరు పోర్టు - రాజధాని నిర్మాణం - గంగవరం - భోగాపురం - పరిశ్రమలు - దీవీస్ - ఆక్వా మెగాపార్కు పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. కానీ చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు స‌రైన రీతిలో బుద్ధి చెప్పే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News