రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు... అజిత్ ధోవెల్...?

Update: 2022-06-21 13:51 GMT
దేశానికి కొత్త రాష్ట్రపతి ఎవరు అన్న దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో బీజేపీకి ఉన్న ఆధిక్యం బట్టి ఆ పార్టీ ఎంపిక చేసిన వారే రాష్ట్రపతి భవన్ లో కొలువు తీరడం ఖాయం. ఇదిలా ఉంటే రాష్ట్రపతి రేసులో బీజేపీ షార్ట్ లిస్ట్ లో నుంచి చివరికి రెండు పేర్ల మధ్య హోరా హోరీ ఫైటింగ్ సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ రెండు పేర్లలో ఒకటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవెల్ అయితే రెండవది ఎం వెంకయ్యనాయుడు. ప్రస్తుతం ఈ రెండు పేర్ల మీదనే బీజేపీ కసరత్తు చేస్తోంది అని తెలుస్తోంది. అజిత్ ధోవెల్ సీనియర్ అధికారిగా దేశానికి సేవలు అందించారు. దేశ భద్రతకు సంబంధించి ఆయన కీలకమైన సలహాలు ఇస్తున్నారు. ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. రాజకీయాలకు అతీతంగా చూడాలీ అంటే ఆయనే కొత్త రాష్ట్రపతి అవుతారు.

వాజ్ పేయ్ నుంచి మోడీ దాకా బీజేపీ ప్రధానులకు అజిత్ ధోవెల్ కుడి భుజం లాంటి వారు కాబట్టి ఆయన పేరు చాలా కీలకంగా ఉంది. అయితే రాజకీయంగా చూసుకున్నా బీజేపీకి ప్రతిష్ట, దక్షిణాదిన రేపటి రాజకీయాల్లో కమలదళం దూసుకుపోవాలని చూసినా కూడా వెంకయ్యనాయుడు  అభ్యర్ధిత్వం కూడా చాలా సీరియస్ గా పరిశీలించాల్సి ఉంటుంది.

ఇక్కడ రెండు విషయాలలో బీజేపీ మీద అందరి చూపూ ఉంది. ఎల్  అద్వానీ మనిషిగా వెంకయ్యనాయుడుని చెబుతారు. అద్వానీ బ్యాచ్ ని పక్కన పెట్టే చర్యలను మోడీ షా తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిని కాకుండా చేస్తే కనుక ఆ అపవాదు అలాగే మిగిలిపోవడమే కాకుండా బలపడుతుంది. అలాగే బీజేపీకి దక్షిణాది వివక్ష అన్నది ఉందని ఆయా రాష్ట్రాల ప్రజలు భావిస్తారు. బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అని కూడా విమర్శలు ఉన్నాయి.

అది కాదు అని నిరూపించుకోవాలీ అంటే వెంకయ్యనాయుడు కంటే బెస్ట్ ఆప్షన్ కూడా వేరేది లేదు. దాంతో వెంకయ్యనాయుడు ఇపుడు చాలా కీలకంగా మారారు అని అంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ప్రత్యక్షంగా కలసి మరీ ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు అని అంటారు.

యోగా కార్యక్రమాలలో హైదారాబాద్ లో ఉన్న వెంకయ్యనాయుడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం అంటేనే ఆయన పేరు ముందు వరసలో ఉందని అంతా భావిస్తున్నారు.   వెంకయ్యనాయుడుని  రాష్ట్రపతిని చేసి  అజిత్ ధోవెల్ ని  ఉప రాష్ట్రపతిగా   చేస్తారు అన్న మాట కూడా ఉంది. ఆ విషయం మీద ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే ఆయన వద్దకు కీలక మంత్రులు వెళ్ళారని కూడా అంటున్నారు.  ఇక ఇన్ని అవకాశాలు ఉన్నా బీజేపీ పెద్దల మనసు వారి ఆలోచనలు తెలియవు. కాబట్టి  మరి చూడాలి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News