విస్త‌రించినా త‌మ్ముళ్లు ఏమ‌నర‌న్న వెంక‌య్య‌?

Update: 2017-04-23 05:34 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు.. బీజేపీ అగ్ర‌నేత‌ల్లో ఒక‌రు.. తెలుగువాడు.. కేంద్ర‌మంత్రి అయిన వెంక‌య్య‌నాయుడు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కార్య‌క‌ర్త‌ల‌తోనూ.. పార్టీనేత‌ల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. రాజ‌కీయాల్లో ఎవ‌రెంత మిత్రులైనా.. ఏకంగా త‌మ బంగారు పుట్ట‌లో వేలు పెట్ట‌టానికి అస్స‌లు ఒప్పుకోరు.

కానీ.. వెంక‌య్య మాట‌లు మాత్రం అంద‌కు భిన్నంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఏపీలో అంతంత‌మాత్రంగా ఉండే బీజేపీని మ‌రింత విస్త‌రించేలా కార్య‌క్ర‌మాల్ని జోరుగా సాగించాల‌న్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఏపీ అధికార‌ప‌క్షమైన తెలుగుదేశం పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో పార్టీని మ‌రింత‌గా విస్త‌రించాల‌ని భావిస్తోంది. ఏపీలో తాము విస్త‌రిస్తామంటే.. మిత్ర‌ప‌క్షంగా ఉన్న తెలుగుదేశం వారు మ‌న‌ల్ని తిర‌గొద్దంటారా? అంటూ వెంక‌య్య ప్ర‌శ్నిస్తుండ‌టం విశేషం.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు పూర్తి అవుతున్న వేళ‌.. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వ‌ర్యంలో స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీతో పాటు ప‌లువురు ఏపీ బీజేపీ ప్ర‌ముఖుల‌తో పాటు.. వెంక‌య్య‌నాయుడు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన వెంక‌య్య‌.. త‌మ నాయ‌కుడు.. ప్ర‌ధాని మోడీ అంద‌రికి తెలిసినవాడ‌ని.. ప్ర‌తి ఇంటి త‌లుపు త‌ట్టి.. మోడీ పార్టీ త‌ర‌ఫు నుంచి వ‌చ్చామని చెప్పాల‌న్నారు. అంద‌రిని బీజేపీలో చేర్పించేందుకు ఒప్పించాల‌న్న సూచ‌న‌ను చేశారు. ఓప‌క్క మిత్ర‌ప‌క్షం ఉన్నా.. వారికి మించి దూసుకెళ్లేలా ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్ ను వెంక‌య్య అండ్ కో సిద్ధం చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని చెప్పాలి. ఇలాంటి వాటి ప‌ట్ల మిత్ర‌ప‌క్షం గుర్రుగా ఉంటుంద‌న్న విష‌యం మీద అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ.. అలాంటిదేమీ ఉండ‌ద‌న్న భ‌రోసా ఇవ్వ‌టం వెనుక మ‌ర్మం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వెంక‌య్య ఏం చేసినా చంద్ర‌బాబు ఏమి అన‌రా? ఎందుక‌లా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News