కారుకు కాషాయం వేస్తున్నదెవరు?

Update: 2016-03-12 06:36 GMT
తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన టిఆర్ ఎస్ - బిజెపిలు ఆ తరువాత చాలాకాలం ఎడమొహం పెడమొహంగానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే... ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీకి తెలంగాణలోని టీఆరెస్ దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్డీఏలో టిఆర్ ఎస్ చేరికపై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నప్పటికి గులాబీ దళం ఖండిస్తున్నప్పటికీ రాజకీయ పరిస్థితులు మాత్రం ఆ రెండు పార్టీల కలయిక త్వరలో ఉంటుందన్న సూచనలు ఇస్తున్నాయి.
   
సార్వత్రిక ఎన్నికల తరువాత టీఆరెస్ స్థాయికి మించి మోడీపై తీవ్ర విమర్శలు చేయడం... ఆ తరువాత కూడా ఘర్షణాత్మక వైఖరితోనే వ్యవహరించిన నేపథ్యంలో రెండూ పార్టీల మధ్య దూరం పెరిగింది. మధ్యలో టీఆరెస్ మోడీ ప్రభుత్వంలో కలవాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీఆరెస్ మోడీ ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ రెండు పార్టీలను కలిపే బాధ్యతను తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత... కేసీఆర్ సామాజిక వర్గానికే చెందిన చెన్నమనేని విద్యాసాగరరావు భుజానికెత్తుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న విద్యాసాగరరావు ఈ దిశగా ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేశారని సమాచారం.
   
గోదావరి నది పై మహరాష్ట్ర తో చేసుకున్న ఒప్పందాల సమ యంలో కెసిఆర్ రెండు రోజుల పాటు ముంబయిలో గడిపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుండి బయలు దేరిన ఆయన నేరుగా ముంబయి లోని రాజ్ భవన్‌ కు చేరుకున్నారు. రెండు రాష్ట్రాల మద్య జరిగిన జల ఒప్పందంలో విద్యాసాగరరావు కీలక పాత్ర పోషించారు. గోదావరి నదిలో వృథాగా పోతున్న వందల టీఎంసీల నీటి వాడకం పై తెలంగాణ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యాస్కోప్ సంస్థతో సర్వే నిర్వహించింది. అందులో భాగంగా తెలంగాణ - మహారాష్ట్రలకు మేలు కలిగేలా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకున్నారు. విద్యాసాగర్ రావుతో కేసీఆర్ కు మొదటి నుంచి సాన్నహిత్యం ఉంది.
   
కాగా జల ఒప్పందాల కోసం ముంబయి వెళ్లిన కేసీఆర్ అక్కడ రాజ్ భవన్ లోనే రెండు రోజుల పాటు బస చేశారు. ఆ సమయంలో పలువురు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఎన్డీఏలో టీఆర్ ఎస్ చేరికపై ఆర్ ఎస్ ఎస్ కూడ ఆసక్తిగానే ఉందని ముంబయి మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
Tags:    

Similar News