మాల్యా తిరిగి వస్తాడట కానీ.. కండీషన్లు ఉన్నాయ్

Update: 2016-05-16 07:19 GMT
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయిల బకాయిల్ని ఎగ్గొట్టి.. గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించిన ఆసక్తికర కథనం ఒకటి ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యేలా చేసింది. వేలాది కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి బ్రిటన్ కు వెళ్లిపోయిన అతన్ని వెనక్కి తీసుకురావటానికి భారతదేశం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించని సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాను చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన విజయ్ మాల్యా ఆసక్తికర ఆఫర్ ఒకటి చేశారు.

తాజాగా యునైటెడ్ బ్రూవరీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశానికి మాల్యా హాజరయ్యారు. అక్కడెక్కడో లండన్ లో ఉన్న మాల్యా.. ముంబయిలో జరిగిన ఈ మీటింగ్ కు ఎలా హాజరయ్యారన్న సందేహం అక్కర్లేదు. టెక్నాలజీ పుణ్యమా అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోర్డు మీటింగ్ కు అటెండ్ అయిన మాల్యా తాజాగా సరికొత్త ప్రతిపాదన చేశారు. తాను బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లిస్తానని.. అయితే.. తనను అరెస్ట్ చేయమని.. తనకు రక్షణ కల్పిస్తామని హామీ కానీ ఇస్తే తాను భారత్ కు వచ్చేందుకు సిద్ధమని మాల్యా చెప్పటం గమనార్హం.

వేలాది కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి .. వాటిని తిరిగి చెల్లించే విషయంలో చుక్కలు చూపిస్తున్న మాల్యా.. తానుచెల్లించాల్సిన అప్పు తిరిగి ఇచ్చేస్తే తన మీద ఏ కేసు ఉండకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఇదేదో ఇంతవరకూ రాకుండా ముందే డబ్బులు చెల్లిస్తే సరిపోయేదికదా? అప్పుడు చేయని ఆ పనిని.. మాల్యా ఇప్పుడు చేయటానికి ఎందుకు సిద్ధమవుతున్నట్లు..? లాంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఏమైనా.. రోజుకో తరహా ప్రతిపాదనలు తీసుకొచ్చే మాల్యా.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోర్కెలు కోరతారో..?
Tags:    

Similar News