లిక్కర్ కింగ్ మాల్యాకు ఎంత ధైర్యమంటే..?

Update: 2016-06-19 07:12 GMT
చట్టమంటే భయం.. భక్తి ఉండాలి. కానీ.. అలాంటివేమీ లేని ఒక బిజినెస్ టైకూన్ ఎంతకు తెగిస్తాడన్నది లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కోట్లాది రూపాయిలు బ్యాంకుల దగ్గర నుంచి అప్పుగా తీసుకొని.. వాటిని తీర్చకుండా.. దొంగచాటుగా దేశం నుంచి పారిపోయిన వైనం తెలిసిందే. పారిపోయిన దోషిని దేశానికి తిరిగి తీసుకొచ్చి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. అలాంటివేమీ జరగని పరిస్థితి.

వేలాది కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి.. తనదారిన తాను పోయిన వ్యక్తిని తీసుకురాలేకపోయిన దేశంలోని చట్టాల మీద నమ్మకమో.. దేశానికి నాయకత్వం వహిస్తున్న వారి సామర్థ్యం మీద ఉన్న విశ్వాసమో కానీ ఆయన తాజా చర్య చూస్తే బరితెగింపు అన్న భావన కలగటం ఖాయం. బ్రిటన్ కు పారిపోయిన ఆయన తాజాగా ఒక కార్యక్రమానికి హాజరు కావటమేకాదు.. ఆ కార్యక్రమంలో భారత హై కమిషనర్ కూడా పాల్గొనటం చూస్తే.. లిక్కర్ కింగ్ రేంజ్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

ప్రముఖ రచయిత సుహెల్ సేథ్ కొత్త పుస్తకం విడుదల కార్యక్రమానికి హాజరైన ప్రత్యేక అతిధుల్లో మాల్యా కూడా ఒకరట. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యే సమయానికి భారత రాయబారి నవ్తేజ్ సర్నా కూడా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఈ ఇష్యూ వివాదాస్పదం కావటంతో సర్దుకున్న నిర్వాహకులు.. తాము మాల్యాను ఆహ్వానించలేదని.. ఆయనే తనకు తానుగా వచ్చి ఉంటారంటూ చెప్పటం గమనార్హం. చట్టాలు తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలన్న నమ్మకం ఉన్న మాల్యా లాంటి వాళ్లు ఇలాంటి యాషాలు (వేషాలు) ఎన్నైనా వేయగలరు. చట్టం వారికి చుట్టమే కదా?

దీనికి భిన్నంగా మాల్యా తాజాగా చేసిన వ్యాఖ్య విదేశాంగ శాఖకు జెల్లకాయి కొట్టినట్లుగా ఉండటం గమనార్హం. పిలవకుండా ఒక కార్యక్రమానికి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదని.. తన జీవితంలో పిలవని పేరంటానికి ఇంతవరకూ వెళ్లలేదని.. పుస్తకావిష్కరణ సభకు తనకు ఆహ్వానం ఉందని.. అందుకే తాను వెళ్లినట్లుగా ఆయన వెల్లడించారు.

పుస్తక రచయిత తనకు మంచి మిత్రుడని.. ఆయన కోసం తాను వెళ్లినట్లు చెప్పిన మాల్యా .. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని.. ఛార్జ్ షీట్ లేదని.. ఏదైనా ఆరోపించే ముందు తన వాదనను వినిపించే అవకాశం ఇవ్వలేదని.. ఇది దురదృష్టకరంగా ఆయన అభివర్ణించారు. తాజాగా మాల్యా ఇచ్చిన పవర్ పంచ్ తో విదేశాంగ శాఖ నోటి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో..?
Tags:    

Similar News