బ్రహ్మానందం కామెడీలా కేసీఆర్ మాటలు

Update: 2019-03-26 05:21 GMT
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. మాజీ ఎంపీ విజయశాంతి.. తన ఒకప్పటి మాజీ సహచరుడు అయిన కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మెదక్ లో నిర్వహించిన సింహగర్జన ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని.. కేసీఆర్ మాటలు చూస్తుంటే బ్రహ్మానందం, ఆలీ కామెడీలా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.  దేశమంతా ప్రధానిగా మోడీ వద్దనుకుంటే.. కేసీఆర్ మాత్రం కావాలంటున్నారని విమర్శించారు.

2014లో మెదక్ శాసనసభ నుంచి పోటీకి దిగితే తనను కుట్రలు, కుతంత్రాలు చేసి ఓడించారని విజయశాంతి నిప్పులు చెరిగారు. గెలిచినా.. ఓడినా తన ఇల్లు మెదక్ అని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాకు రైలు నేనే సాధించానని చెప్పుకొచ్చారు. మెదక్ ఎంపీ, ఎమ్మెల్యే వసూల్ రాజా, వసూల్ రాణిలుగా మారారని విజయశాంతి ఆరోపించారు.

ఇక కేటీఆర్ తీరును కూడా విజయశాంతి ఎండగట్టారు. ఒకప్పుడు సిరిసిల్లలో తాను ప్రచారం చేసి కేటీఆర్ ను గెలిపించానని.. అప్పుడు నేనే దేవత.. ఇప్పుడు దెయ్యం లా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యేవాడా అని నిలదీశారు. కేసీఆర్ మాయమాటలు జనం నమ్మవద్దని.. ప్రజలు ఆలోచించాలని.. లేకపోతే తమ గొయ్యి తాము తీసుకున్నట్టేనని హెచ్చరించారు.
Tags:    

Similar News