బాబుకు ఊహించ‌ని షాకిచ్చిన గ్రామ‌స్తులు

Update: 2017-04-30 05:29 GMT
జ‌నం నాడి తెలుసుకోకుండా ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం అస్స‌లు చేయ‌కూడ‌దు. ఆ విష‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌గ్గ‌ర మిగిలిన నేత‌లు నేర్చుకోవాల్సిందే. ఎవ‌రు నేర్చుకున్నా.. నేర్చుకోకున్నా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో ఒక‌ప్ప‌టి త‌న శిష్యుడి ద‌గ్గ‌ర పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. రోటీన్ గా ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం.. తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మొహ‌మాటం కోస‌మైనా బాగుంద‌ని చెబుతార‌ని అనుకున్నారో ఏమో కానీ.. అలా ఫీలై అడిగిన ప్ర‌శ్న‌కు.. చంద్ర‌బాబే చివ‌ర‌కు ఫీల్ కావాల్సి వ‌చ్చింది.

ఏ గ్రామానికైనా వెళ్లిన వెంట‌నే.. వ‌రాలు ఇచ్చేయ‌టం.. అన్ని చేశాం.. ఇన్ని చేశాం.. మీకిప్పుడేం అవ‌స‌రం లేదుగా? స‌ంతృప్తిగా ఉన్నారా? అన్న ప్ర‌శ్న‌లు వేయ‌టం.. ప‌వ‌ర్ ఉన్న అధినేత నోటి నుంచి వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు మోహ‌మాటంలో త‌ల‌లు ఊపేయ‌టం లాంటివి చూస్తుంటాం. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించి సీఎంకే షాకిచ్చిన వైనం న‌ల్ల‌జ‌ర్ల మండ‌లం పోత‌వ‌రం గ్రామ‌స్తుల సొంతంగా చెప్పాలి. ఏలూరుకు ద‌గ్గ‌ర్లోని న‌ల్ల‌జ‌ర్ల మండ‌లం పోత‌వ‌రం గ్రామానికి వెళ్లారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.

ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని ప్రారంభించిన ఆయ‌న‌.. గ్రామ‌స్తుల‌తో భేటీ అయ్యారు. మీ గ్రామానికి కావాల్సిన‌వ‌న్నీ చేశాం.. అంతా సంతోషంగా ఉన్నారా? అని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు. ముఖ్య‌మంత్రి స్థాయి నేత అలా అడిగితే.. సాదాసీదా జ‌నం ఎలా రియాక్ట్ అవుతారు? త‌ల ఊపేస్తారు. కానీ.. ఇక్క‌డే సీన్ రివ‌ర్స్ అయ్యింది. లేదు.. లేదు.. సంతోషంగా లేమంటూ గ్రామ‌స్తులు ఇచ్చిన స‌మాధానంతో బాబు ఒక్క‌సారిగా కంగుతిన్నారు. అక్క‌డితో ఏదో ఒక‌టి క‌వ‌ర్ చేసినా స‌రిపోయేది. మ‌రో ప్ర‌శ్న వేస్తే.. వెన‌క్కి త‌గ్గుతార‌ని అనుకున్నారేమో కానీ.. ఎంత‌మంది సంతృప్తిగా లేరో చేతులెత్తండి అంటూ చేతులెత్త‌మ‌న‌టం.. బదులుగా అక్క‌డ ఉన్న వారిలో 70 శాతం మంది చేతులు పైకెత్తేయ‌టంతో ఊహించ‌ని షాక్ త‌గిలిన‌ట్లైంది చంద్ర‌బాబుకు.

దీంతో మీ స‌మ‌స్య‌లేమిటంటూ ప్ర‌జ‌ల్ని అడ‌గాల్సి వ‌చ్చింది. అంతే.. అప్ప‌టివ‌ర‌కూ త‌మ‌లో గూడుక‌ట్టుకున్న అసంతృప్తిని.. బాబు పాల‌న‌లో చోటు చేసుకున్న విధాన‌ప‌ర‌మైన లోపాల్ని ఎత్తి చూపించారు. లంచం ఇస్తేనే అధికారులు ప‌ని చేస్తున్నార‌ని.. పింఛ‌న్లు రాలేద‌ని.. ఇల్లు మంజూరు కాలేద‌ని.. భూమి ఇవ్వ‌లేదంటూ.. ఇలా ప్ర‌జ‌లంతా త‌మ స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్టారు. లంచం ఇవ్వ‌కుంటే ప‌ని చేయ‌మ‌న్న అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. త‌న‌కు నివేదిక పంపాల‌ని అధికారుల్ని ఆదేశించారు. ఇలా.. ఎవ‌రికి వారు త‌మ‌కున్న స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్ట‌టంతో బాబుకు షాక్ త‌గిలినంత ప‌నైందని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News