అస్వస్థతను పంటికింద భరిస్తూ.. ఐదు సెషన్ల బ్యాటింగ్

Update: 2023-03-14 17:04 GMT
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అహ్మదాబాద్ లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు నిస్సారమైన డ్రాగా ముగిసింది. అంతకుముందు మూడు టెస్టుల్లో ఒకే సెంచరీ (మొదటి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్శ) నమోదు కాగా.. నాలుగో టెస్టులో మాత్రం నాలుగు సెంచరీ రికార్డయ్యాయి. టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి, యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్, ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడంకెల స్కోర్లు చేశారు. దీన్నిబట్టే పిచ్ ఎంత నిస్సారంగా ఉందో తెలిసిపోతుంది.

స్పిన్ కు తలవంచి మూడో టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. నాలుగో టెస్టులోనూ అదే ఫలితం ఎదురవుతుందని భయపడిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఉన్న స్టేడియం. అందులోనూ కీలకమైన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ముగింట కావడంతో మరింత జాగ్రత్త పడ్డారా? అనే సందేహాలూ వస్తున్నాయి.

ఏమైతేనేం.. ఈ టెస్టులో భారత్ ఓడిపోలేదు. టెస్టు డ్రాగా ముగిసింది. అటు న్యూజిలాండ్ మీద శ్రీలంక పోరాడి ఓడడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మార్గం మరింత సులువైంది. కాగా, నాలుగో టెస్టులో హైలైట్ విరాట్ కోహ్లి భారీ సెంచరీ. అద్భుత శతకంతో టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపాడు కింగ్ కోహ్లీ. 186 పరుగులు చేసి కెరీర్‌లో 75 శతకం నమోదు చేశాడు. అయితే కోహ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, మైదానంలో కాస్త ఇబ్బందిపడుతున్నాడని వార్తలొచ్చాయి.

మొహం కాస్త నీరసంగా

నాలుగో టెస్టులో కోహ్లి చేసిన సెంచరీ.. అతడికి మూడు సంవత్సరాల మూడు నెలల తర్వాత వచ్చింది. ఇంత సుదీర్ఘ సమయం తర్వాత తనకిష్టమైన ఫార్మాట్లో మూడంకెలు కొట్టినా కోహ్లి సంబరాలు చేసుకోలేదు. వాస్తవానికి కోహ్లి ఎప్పుడు శతకం చేసినా.. గాల్లోకి ఎగిరి పంచ్ లు విసురుతాడు. అహ్మదాబాద్ లో మాత్రం అలా చేయలేదు. కేవలం హెల్మెట్ తీసి అభివాదం చేసి సరిపెట్టాడు. అప్పుడు అతడి మొహంలో నీరసం స్పష్టంగా కనిపించింది. నాలుగో టెస్టులో 62వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన కోహ్లి 179వ ఓవర్ 5వ బంతికి ఔటయ్యాడు. ముందురోజుతో కలిపి దాదాపు ఐదు సెషన్లు బ్యాటింగ్ చేశాడు. అయితే మధ్యలో విరామం దొరికింది కాబట్టి విరాట్ మొహంలో నీరసాన్ని ఎక్కువ సేపు క్రీజులో గడిపినందుకు వచ్చినదిగా భావించలేము.

అస్వస్థతతోనే..?

ఆట నాలుగో రోజు కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అక్షర్ పటేల్.. కోహ్లి అనారోగ్యం విషయం గురించి తనకు తెలియదని చెప్పాడు. అతడు ఇబ్బంది పడుతున్నట్లు తనకు అన్పించలేదని,  వికెట్ల మధ్య పరుగెడుతున్నప్పుడు ఎలాంటి అసౌకర్యంగా కూడా కన్పించలేదని చెప్పుకొచ్చాడు. ఎండను కూడా తట్టుకుని గంటలపాటు క్రీజులో ఉండి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పుకొచ్చాడు. కాగా, టెస్టు మ్యాచ్ చివరి రోజు కోహ్లీ రోజంతా ఫీల్డింగ్ చేశాడు. దీంతో అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు అర్థమైంది.

కానీ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విరాట్‌ కోహ్లీ ఆరోగ్యం ఎలా ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. కోహ్లీ కాస్త దగ్గుతున్నాడని రోహిత్ వెల్లడించాడు. కానీ అంతమాత్రానికే అనారోగ్యంగా ఉన్నట్లు కాదు కదా అని బదులిచ్చాడు. కోహ్లీ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తనకు అన్పించిందని చెప్పుకొచ్చాడు. నాలుగో టెస్టులో టీమిండియా పటిష్ఠ స్థితిలో ఉండటానికి కోహ్లీనే ప్రధాన కారణమని కొనియాడాడు. ఈ మ్యాచ్ డ్రా కావడం వల్లే సిరీస్ మనం కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశాడు. మొత్తమ్మీద చూస్తే కోహ్లి స్వల్ప అస్వస్థతతోనే మారథాన్ బ్యాటింగ్ చేసినట్లు తెలుస్తోంది.       



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News