బీజేపీ రాజు గారు... సైకిలెక్కిన సీటు గ్యారంటీ కాదట...?

Update: 2023-05-08 16:02 GMT
మబ్బుల్లో నీళ్ళు చూసుకుని ముంత ఒలకబోసుకుంటే నష్టం ఎవరికో తెలిసిందే. బీజేపీ లో ఉంటూ టీడీపీకి కన్ను గీటుతున్న బీజేపీ విశాఖ నార్త్ సీటు మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కు ఇపుడు పుట్టిల్లు లాంటి బీజేపీతో గ్యాప్ పెరిగిపోయింది. దానికి ఒక విధంగా ఆయనే కారణం అని చెప్పుకోవాలి. పోయి పోయి తెలుగుదేశం అనుకూల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

అక్కడ రాజు గారు మాట్లాడిన తీరుతో బీజేపీ పెద్దలు ఆయన మీద గుర్రు మన్నారు వెంటనే షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు. దానికి ఆయన వివరణ ఇవ్వడం ఎటూ జరుగుతుంది. కానీ రాజు గారు ఇపుడు కిం కర్తవ్యం అన్న ఆలోచనలో పడ్డారుట. ఇక రాజు గారు టీడీపీలో చేరుతారు అని రూమర్స్ అయితే చాలా కాలంగా ఉన్నాయి.

ఇక ఆయన దీని మీద తెర వెనక సంప్రదింపులు జరుపుతున్నారు అని ప్రచారం సాగుతోంది రాజు గారి మనసు పసుపు పార్టీ మీద ఉంది కానీ సీటు విషయం దగ్గరే ఏమీ తేలడంలేదు అని అంటున్నారు. 2014లో చూస్తే టీడీపీ బీజేపీ పొత్తుల ఆయన గెలిచారు 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో రాజు గారికి 18 వేల పై చిలుకు ఓట్లు దక్కాయి.

ఇక 2024లో ఒంటరిగా పోటీ చేసే సాహసాన్ని ఆయన చేయడంలేదని అంటున్నారు. దాంతో చాన్నాళ్ళుగా ఆయన గొంతు మారుతూ వస్తోంది. బీజేపీ హై కమాండ్ తేల్చాల్సిన పొత్తుల మీద ఆయన మాట్లాడుతున్నారని అంతున్నారు. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీ వాష్ ఔట్ ఔంటూ ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారని టాక్. అయితే ఇదంతా పబ్లిక్ ఒపీనియన్ అని తన సొంత అభిప్రాయమని ఆయన అంటున్నా ఆయన మనసులో ఉద్దేశ్యం ఏంటి అన్నది అందరికీ తెలిసిపోయింది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో రాజు గారికి బీజేపీ షోకాజ్ నోటీసు ఇచ్చేసింది. ఆయన వివరణ ఇచ్చినా అక్కడ ఉండలేరని అంటున్నారు. దాంతో ఆయన చాలా తొందరలోనే టీడీపీ వైపుగా వస్తారని అంటున్నారు. అయితే టీడీపీ లో చేరితే విశాఖ నార్త్ టికెట్ కన్ ఫర్మ్ చేస్తారా అన్నదే డౌట్ గా ఉంది అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

మళ్లీ ఆయనే ఈ సీటు నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. దానికి కారణం ఉంది. ఆయన భీమిలీ నుంచి పోటీ చేయలని చూస్తున్న పొత్తులో ఆ సీటు జనసేన కు వెళుతుంది అని అంటున్నారు. గాజువాక మీద గంటా మనసు పడినా దానికీ పోటీ ఉంది. ఈ నేపధ్యంలో గంటా ఉన్న సీట్లోనే కుదురుకుని మరో సారి పోటీ చేస్తారని అంటున్నారు గంటా సిట్టింగ్ సీటు నుంచి కదలక పోతే బీజేపీ రాజుకు బిగ్ ట్రబుల్ తప్పదని అంటున్నారు.

ఆయన టీడీపీలో చేరినా పార్టీలో ఉండి పనిచేయాల్సిందే తప్ప సీటు అయితే దక్కదని అంటున్నారు. పార్టీ గెలిస్తే ఏదో న్యాయం చేస్తామని చెబుతారు తప్ప సీటు అయితే ఇచ్చే ప్రసక్తి ఉండదని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ తరఫున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ ద్వారా ఫ్లోర్ లీడర్ గా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణు కుమార్ రాజు రాజకీయం ఏంటో ఆయనకే కాదు ఆయన అనుచరులకు కూడా అర్ధం కావడంలేదుట.

బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దాని మీద క్రమ శిక్షణా సంఘం సంతృప్తి వ్యక్తం చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. ఇక రాజు గారు బీజేపీలో కొనసాగడం కష్టమే అని తేలిపోతున్న వేళ ఎలాంటి కండిషన్లు పెట్టకుండా భేషరతుగా టీడీపీలో చేరాల్సి ఉంటుంది. మొత్తానికి అన్నీ చూసుకుని సీటు కన్ ఫర్మ్ చేసుకుని పార్టీ మారాలని రాజు గారు ప్లాన్ వేసి ఉండవచ్చు కానీ ఒకే ఒక ఇంటర్వ్యూ అందునా టీడీపీకి అనుకూల మీడియాగా ముద్రపడిన దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చి రాజు గారు బిగ్ ట్రబుల్స్ లో పడ్డారని అంటున్నారు.

Similar News