ఇప్ప‌టికి ఛీ కొట్టించుకుంటుంది స‌రిపోవ‌ట్లేదా?

Update: 2018-03-06 07:37 GMT
గ‌డిచిన ద‌శాబ్దాల కాలంలో ద‌క్షిణాదికి చెందిన రాష్ట్రాలు.. అందునా తెలుగు ప్రాంతాల వారి నోటి నుంచి ఎప్పుడూ రాని మాట ఒక‌టి వ‌చ్చింది. గ‌డిచిన నాలుగైదేళ్ల వ్య‌వ‌ధిలో త‌ర‌చూ వ‌స్తోంది. ఇంత‌కీ ఆ మాట ఏమిటంటే.. మేం ఈ దేశంలో భాగం కాదా? అన్న‌ది. ఇలాంటి మాట రావ‌టానికి ఎంతో ఆవేద‌న‌.. అంత‌కు మించిన బాధ‌.. అదే ప‌నిగా మోస‌పోతున్నామ‌న్న భావ‌న కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇలాంటి భావ‌న‌ను మొగ్గ‌లో తుంచేయాల్సిన జాతీయ నాయ‌క‌త్వం.. అది అంత‌కంత‌కూ పెరిగేలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏ మాత్రం క్ష‌మార్హం కాదు. విభ‌జ‌న గాయాల‌కు మందుపూసి సాంత్వ‌న పొందేలా చేయ‌టం.. విభ‌జ‌న‌ను గాయం కాదు.. మ‌రో ఎత్తుకు ఎదిగేందుకు ల‌భించిన సువ‌ర్ణ అవ‌కాశంగా ఏపీ ప్ర‌జ‌లు ఫీల‌య్యేలా చేయాల్సింది పోయి.. ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు.. హ‌క్కుల సాధ‌న‌ల కోసం విలువైన కాలాన్ని వెచ్చించేలా చేయ‌టం చారిత్ర‌క త‌ప్పిదం అవుతుంది.

దేశంలో ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌మ‌ల‌నాథులు చేష్ట‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. త‌మ చేత‌ల కార‌ణంగా కేసీఆర్ లాంటి నేత ఇప్పుడు కొత్త ఫ్రంట్ రాగం తీయ‌టం తెలిసిందే. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన బుల్లెట్ లాంటి మాట‌ల‌తో తెలంగాణ బీజేపీ నేత‌ల నోటికి తాళాలు ప‌డిపోయిన ప‌రిస్థితి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను త‌క్కువ‌గా అంచ‌నా వేసి త‌ప్పు చేశామ‌న్న ఆలోచ‌న బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వంలోనూ.. సంఘ్ ప‌రివార్ లోనూ ఇప్పుడిప్పుడే ఇస్తోంది. మోడీకి ఎదురుగా నిల‌బ‌డ‌గ‌లిగే ద‌మ్ము.. ధైర్యం ఉన్న నేత దేశంలో ఎవ‌రూ లేర‌న్న భావ‌న నుంచి.. మోడీ పెద్ద తోపేం కాదు.. లెక్క చూసి కొడితే మోడీ అండ్ కోకు చుక్క‌లు క‌నిపించక‌మాన‌ద‌న్న వ‌ర‌కూ మాట‌లు వెళ్ల‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తెలంగాణ‌లో త‌మ‌కు త‌గులుతున్న ఎదురుదెబ్బ‌ల నేప‌థ్యంలో తోటి తెలుగు రాష్ట్రంలోని బీజేపీ నేత‌లైనా కాస్త వెనుకా ముందు చూసుకొని మాట్లాడాల్సిన ప‌రిస్థితి.

కానీ.. అలాంటి సోయి త‌మ‌కు లేద‌న్న‌ట్లుగా ఉంది బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాటలు చూస్తుంటే. ప్ర‌త్యేక హోదా కోసం ఏపీలో టీడీపీ నేత‌లు చేస్తున్న నిర‌స‌న‌ల‌పై  ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ నేత‌ల నిర‌స‌న‌లు శృతి మించుతున్నాయ‌న్న హెచ్చ‌రిక‌తో పాటు.. కొంద‌రు టీడీపీ నేత‌లు మోడీని అవ‌మానించేలా నిర‌స‌న చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు.

ప్ర‌ధానిని కించ‌ప‌రిచేలా మాట్లాడేవారిపై సుమోటోగా న‌మోదు చేయాల‌ని.. చంద్ర‌బాబు వెంట‌నే టీడీపీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేశ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. తాము మిత్ర‌ధ‌ర్మం పాటిస్తున్నామ‌ని.. తాముకానీ నోరు విప్పితే ప‌రిస్థితి వేరుగా ఉంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌ధాని మోడీని త‌క్కువ చేసిన మాట్లాడితే అంత‌లా పొడుచుకువ‌స్తున్న విష్ణుకుమార్ రాజు లాంటి వారికి.. ఏపీ ప్ర‌జ‌ల్నిత‌క్కువ చేసి చూడ‌టం.. వారి ప్ర‌యోజ‌నాల్ని కాల‌ద‌న్న‌టం.. ఏపీ స్టేట్‌ ను నిర్ల‌క్ష్యం చేయ‌టం లాంటి పెద్ద త‌ప్పుల్ని మోడీ ఎందుకు చేస్తున్న‌ట్లు? అలాంటి వాటిపై విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్లు ఎందుకు నోరు విప్ప‌టం లేదు?

ఏపీకి చేస్తున్న అన్యాయంపై ఇప్ప‌టికే ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉండ‌టంతో పాటు.. మోడీని ఛీ  కొడుతున్న విష‌యాన్ని రాజు లాంటోళ్లకు ప‌ట్ట‌టం లేదు. నోరు ఉంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే.. ఏపీ ప్ర‌జ‌లకు ఇప్ప‌టికున్న ఆవేశం రెట్టింపు అవుతుంద‌ని.. కాంగ్రెస్ కు ప‌ట్టిన గ‌తే బీజేపీకి ప‌డుతుంద‌న్న విష‌యాన్ని రాజు అండ్ కోలు ఎంత త్వ‌ర‌గా గ్ర‌హిస్తే అంత మంచిది.

Tags:    

Similar News