వివేకా హత్య కేసులో ఈసారి తండ్రీకొడుకులకు పిలుపు!

Update: 2023-02-19 10:23 GMT
సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో ఈ కేసు విచారణను వేగవంతం చేసిన సీబీఐ అందుకు తగ్గట్లుగా నిర్ణయాల్ని తీసుకుంటోంది. ఈ మధ్యనే వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారణకు పిలిచిన అధికారులు..తాజాగా ఆయనకు ఆయన తండ్రికి రోజు తేడాతో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

ఎంపీ అవినాశ్ రెడ్డిని ఫిబ్రవరి 24న మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని పేర్కొన్న సీబీఐ.. ఆ తర్వాతి రోజు (ఫిబ్రవరి 25) పులివెందులలో అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నోటీసుల్ని వారిద్దరికి అందజేశారు.

అయితే.. ఈ నోటీసులకు భాస్కర్ రెడ్డి రియాక్టు అయ్యారు.

తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్న కారణంగా తాను సీబీఐ అధికారులు పేర్కొన్న తేదీకి విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు. గతంలోనూ ఆయన కుమారుడు అవినాశ్ రెడ్డి ఇదే రీతిలో రియాక్టు కావటం.. ఆ తర్వాత విచారణకు హాజరు కావటం గమనార్హం.

దీంతో.. సీబీఐ అధికారులు మళ్లీ ఎప్పుడు పిలుస్తారో చూడాలి. ఇక.. ఎంపీ అవినాశ్ రెడ్డి మాత్రం తాజా నోటీసులకు రియాక్టు కాలేదు. మరి.. ఆయనకు కూడా ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయా? లేవా? అన్నది తేలాల్సి ఉంది.

ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండుసార్లు విచారణ చేశారు. ఇక.. అవినాశ్ రెడ్డి విషయానికి వస్తే.. జనవరి 28న ఆయన్ను సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ నోటీసులు ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. తండ్రీ కొడుకులు ఇద్దరిని ఒకరోజు తేడాతో విచారణకు పిలవటం ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News