వివేకా హత్య కేసు లేటెందుకో... గుట్టు చెప్పిన కామ్రేడ్

Update: 2023-05-24 19:00 GMT
తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆసక్తిని ఉత్కంఠను కలిగించే కేసుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఉంది. ఈ కేసులో నాలుగేళ్లు గడచినా దోషులు ఎవరో తేలడంలేదు. ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. ఏపీ కాకుండా పొరుగు రాష్ట్రాలలో విచారణ సాగుతోంది.

ఇక డెడ్ లైన్ పెట్టి మరీ విచారణను పూర్తి చేయమని కోర్టులు ఆదేశిస్తునాయి. అయినా ఈ కేసులో మాత్రం అనుకున్న పురోగతి కనిపించడంలేదు. ఎందుకు ఇలా అన్నది అందరిలోనూ ఉన్న సందేహం. అయితే సీనియర్ మోస్ట్ కామ్రేడ్ సీపీఐ నారాయణ దీనికి కారణం ఏంటో కనుగొన్నారు, ఆ గుట్టు కూడా విప్పారు.

లోపాయికారీ ఒప్పందాల వల్లనే సీబీఐ కేస్దు ఆలస్యం అవుతోందని నారాయణ తేల్చారు. ఆ లోపాయి కారీ ఒప్పందాలు ఎవరెవరు ఎవరితో చేసుకున్నారు అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. ఒక విధంగా ఆయన చెబుతున్న దాని బట్టి చూస్తే ఈ కేసుని ముందుకు సాగనీయకుండా ఎవరో ఆపుతున్నారనే అంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సీబీఐ ఏపీలో ఉత్సవ విగ్రహంగా మారింది అని నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. సీబీఐ ఈ కేసుని టేకప్ చేసినా కూడా విచారణ వేగంగా జరగకపోవడం కీలకమైన అరెస్టులు లేవని విపక్షాలు మండిపడుతున్నాయి. వారందరి తరఫున నారాయణే ఈ మాటలు అనేశారు అన్న మాట. సీబీఐ వంటి సంస్థను పట్టుకుని పెద్దాయన చాలానే మాట్లాడారు అన్న మాట.

ఇక ఏపీలో పొత్తుల మీద మరోసారి కామ్రేడ్ కడుపు చించుకున్నారు. ఏపీకి బీజేపీ ప్రధాన శత్రువుని అనేశారు. రెండవ శత్రువు వైసీపీ అన్నారు.  ఆ విషయం మరచి తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తులకు ఆరాటపడడం దారుణం అంటున్నరు.

టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కోసం జనసేన దళారీ పాత్ర పోషిస్తోంది అని పవన్ పార్టీని పెద్ద మాటే అనేసారు. జనసేన మీద రాను రానూ ఎర్రన్నలకు కోపం అలా పెరిగిపోతోంది అన్న మాట. అందుకే నారాయణ ఈ పెద్ద మాట వాడారు అనుకోవాలి. ఇక ఈ మధ్యనే ఆయన ఒక మాట అన్నారు. మూడు పార్టీలు కలిస్తే వైసీపీనే ఏపీలో మరోసారి గెలుస్తుంది అని.

ఇపుడు కూడా ఆయన అదే మాట అంటున్నారు. బీజేపీ టీడీపీ జనసేన కూటమి తో వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అని నారాయణ జోస్యం చెబుతున్నారు. ఆ విధంగా ఆయన భయపెట్టేశారు. బీజేపీ తోడు ఉంటే సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అయి 2014 మారిదిగా 2024లో గెలవవచ్చు అని తెలుగుదేశం ఆలోచిస్తూంటే నారాయణ మాత్రం అపశకునాన్ని పదే పదే పలుకుతున్నారు. అయినా సరే టీడీపీ మాత్రం ఫిక్స్ అయిపోయినట్లుగా ఉంది. మొత్తానికి ఎర్రన్నల ఉబలాటమే కానీ పొత్తులకు వచ్చే పార్టీలు లెవనే అనుకోవాలి.

Similar News