కెప్టెన్ బ్యాడ్ టైం ఎంత ఘోరంగా ఉందంటే...

Update: 2016-07-13 14:36 GMT
ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఘోర‌ ఫలితాలతో కెప్టెన్‌ విజయకాంత్‌కు చెందిన‌ డీఎండీకే పార్టీ కకావికలమై పోతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్య‌ నేతలు పార్టీ నుంచి వైదొల‌గా తాజాగా మరో నేత వీఎన్‌ రాజన్‌ కూడా డీఎంకే గూటికి చేరుకున్నారు. తాజాగా ఆయన తన మద్దతుదారులతో డీఎంకే కోశాధికారి స్టాలిన్‌ ను కలసి పార్టీ సభ్యత్వాన్ని పొందారు. పార్టీ ఓటమి బాధలో కెప్టెన్ ఉండ‌గా నాయకులు పార్టీ ఫిరాయిస్తూ మరింత కష్టాల్లోకి నెడుతున్నారని అంటున్నారు.

డీఎండీకే దక్షిణ చెన్నై తూర్పు జిల్లా విభాగ కార్యదర్శిగా వ్యవహరించిన వీఎన్‌ రాజన్‌ అన్నాఅరివాలయంలో స్టాలిన్‌ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజన్‌ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని విజయకాంత్‌ ఆరంభంలో ప్రకటించారని, ఆ తర్వాత ప్రజా సంక్షేమ కూటమితో కలసి పార్టీ పరువును మంటగలిపారని ఆరోపించారు. సినిమాల్లో నటించేటప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చే వరకు ఆయనతోనే కలసి ప్రయాణిస్తున్నానని, అందుకు ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు. విజయకాంత్‌ కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందువల్లే డీఎండీకే నుంచి అందరూ వెళ్లిపోతున్నారని తెలిపారు. ఇంకా చాలా మంది నేతలు డీఎండీకే నుంచి విడిపోయి డీఎంకేలో చేరనున్నారని చెప్పారు. ఎన్నికల్లో వేలచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తాను లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా గెలవలేకపోయానన్నారు. తమ కుటుంబ సభ్యులందరూ డీఎంకేలోనే ఉన్నారని - తానూ చేరడం ఆనందంగా ఉందన్నారు. సేలంలో 17న జరగనున్న ‘మక్కల్‌ డీఎండీకే’ పార్టీ విలీనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని ఈ సందర్భంగా రాజ‌న్‌ తెలిపారు.

డీఎండీకేకు చెందిన చీలిక నేతలంతా మ‌క్క‌ల్ డీఎండీకే కింద సొంత గూడు ఏర్పాటుచేసుకొని అందులో కొన‌సాగుతున్నారు. అయితే మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కం అయిన నేప‌థ్యంలో వీరంతా ఇపుడు అటు అధికార అన్నాడీఎంకే లేదా ప్ర‌తిప‌క్ష డీఎంకేలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మ‌రోవైపు కెప్టెన్ పార్టీ అయిన డీఎండీకే నాయ‌కులు సైతం జంప‌వుతున్నారు. దీంతో కెప్టెన్ బ్యాడ్ టైం కొన‌సాగుతోంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News