ఏపీ ఓటు విలువ పెరిగింది..తెలంగాణ‌ది త‌గ్గింది

Update: 2017-06-17 07:20 GMT
రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా కొన్ని లాభాలు.. మ‌రికొన్ని న‌ష్టాలుమామూలే. తాజాగా అలాంటి ముచ్చ‌టే మ‌రొక‌టి తెర‌పైకి వ‌చ్చింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ ప్ర‌కారం లెక్కించ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ ఓటు విలువ ఉమ్మ‌డిరాష్ట్రం కంటే పెర‌గ్గా.. తెలంగాణ ఓటు విలువ ఉమ్మ‌డి రాష్ట్రం కంటే త‌గ్గ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. విభ‌జ‌న నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల ఓట్ల విలువ‌ను విడివిడిగా ఖ‌రారు చేశారు.

విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ఓటు విలువ ఎందుకు పెరిగింది? తెలంగాణ ఓటు విలువ ఎందుకు త‌గ్గింది? అన్న‌ది చూస్తే.. ఈ లెక్క గ‌ట్టిన విధానం ఆస‌క్తిక‌రంగా అనిపించ‌క మాన‌దు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల ఓట్ల‌ను ఆయా రాష్ట్రాల జ‌నాభా ప్రాతిప‌దిక‌న లెక్క క‌డ‌తారు. తాజాగా చూస్తే.. రాష్ట్రప‌తిఎన్నిక సంద‌ర్భంగా ఓట్ల లెక్కింపును 1971 జ‌నాభా ప్రాతిప‌దిక‌న లెక్క క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో 1971 స‌మైక్య రాష్ట్ర జ‌నాభా 4,35,02,708. ఈ జ‌నాభాను 294×1000తో భాగించి.. ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ‌ను 148 గా డిసైడ్ చేశారు.

ఈ లెక్క ప్ర‌కారం 294 ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మ‌డి ఏపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148గా లెక్క క‌ట్టారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువ‌ను విడివిడిగా ఖ‌రారు చేశారు. దీనికి 1971 నాటి స‌మైక్య రాష్ట్ర జ‌నాభాను లెక్క‌లోకి తీసుకున్నారు. దీని ప్ర‌కారం నాడు ఏపీలో 2.78 కోట్ల మంది ఉంటే.. తెలంగాణ జ‌నాభా 1971 నాటి లెక్క‌ల ప్ర‌కారం 1.57 కోట్లుగా లెక్కించారు. ఈ లెక్క‌న ఏపీ ఓటు విలువ‌ను 159గా నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ఓటు విలువ‌ను132గా తేల్చారు.

ఇక్క‌డ జ‌రిగిందేమంటే.. 1971 నాటి జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ‌లో జ‌నాభా బాగా త‌క్కువ ఉండ‌టం.. ఏపీలో ఎక్కువ‌గా ఉండ‌టంతో.. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఏపీ ఎమ్మెల్యేల ఓటు విలువ కంటే 11 వ‌ర‌కు పెరిగి 159గా నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ 16కు త‌గ్గి 132కు త‌గ్గింది. అంటే.. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న ఓటు విలువ కంటే తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ త‌గ్గింది. త‌గ్గిన ఓటు విలువ‌పై తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఉమ్మ‌డిరాష్ట్రంలోని ఓటు విలువను కొన‌సాగించాల‌ని వారు కోరుతున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోని అప్పుల్ని తీసుకోకుండా.. జ‌నాభా ఆధారంగా పంచేసుకోగా లేనిది.. ఎమ్మెల్యే ఓటు విలువ‌ను మాత్రం పంచుకోవ‌టానికి మాత్రం ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News