ఓట్లు బదలాయింపు కష్టమే!

Update: 2018-11-17 05:05 GMT
తెలంగాణ రాష్ట్ర సమితిని... ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును గద్దె దించాలనుకుంటున్న కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సిపిఐ పార్టీల మహాకూటమి కల నెరవేరేలా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కొన్ని పార్టీలు - ఈ ఎన్నికల్లో కొత్త పార్టీల ఓట్లు గంప గుత్తగా మహాకూటమికి పడతాయని - దాని ద్వారా కె.చంద్రశేఖర రావును గద్దె దించవచ్చునని మహాకూటమి నాయకులు కలలు కంటున్నారు.  గత ఎన్నికల్లో విడివిడిగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు ఈసారి  మాత్రం తమకే వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన సర్దుబాటు జాప్యం కొంత అయితే మిగిలినది తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది. తెలంగాణకు చంద్రబాబు నాయుడు పూర్తి వ్యతిరేకి అని తెలంగాణ  ప్రజల్లో నాటుకుపోయిందంటున్నారు.

ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు మహాకూటమికి పడే అవకాశాలు పూర్తిగా లేదనే అంచనాకు వస్తున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో చంద్రబాబు నాయుడి పన్నాగాలు ప్రారంభమవుతాయని - ఇది తెలంగాణకు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని - తెలంగాణ ఉద్యమ సమయంలో వారి వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఇక మహాకూటమిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తుల సమయంలో వ్యవహరించిన తీరుతో తెలంగాణ జనసమితి నాయకులు - కార్యకర్తలు విసిగిపోయారంటున్నారు. చివరకు తమ అధ్యక్షుడు కోదండరాంను సైతం ఇబ్బంది పెట్టారని - ఆయనను చూసే తామంతా కాంగ్రెస్ పార్టీతో కలిస్తే వారు ఆయన్ని అవమానించే రీతిలో వ్యవహరించారనే ఆగ్రహం తెలంగాణ జన సమితి కార్యకర్తల్లో నెలకొంది. దీంతో తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలోనూ శాసించే స్ధాయిలో లేకపోయినా నిర్ణయాత్మక స్ధాయిలో ఉన్న ఓట్లు మహాకూటమికి బదలాంపు జరిగే ప్రశ్నే లేదని అంటున్నారు. ఇక సిపిఐ కూడా సీట్ల సర్దుబాటుపై కినుక  వహించింది. దీంతో ఆ పార్టీకి నిర్దిష్టంగా ఉన్న ఓట్లు కూడా మహాకూటమికి బదలాయింపు జరగవని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మహాకూటమి విజయం కలగానే మిగిలిపోతుందేమో అంటున్నారు.


Tags:    

Similar News