పోలింగ్ టైమింగ్స్ మార‌నున్నాయా?

Update: 2019-05-02 10:26 GMT
ఏడు ద‌శ‌ల్లో సాగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికి నాలుగు విడ‌త‌ల్లో పోలింగ్ ముగిసింది. మ‌రో మూడు విడ‌త‌ల్లో పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది. ఈ నెల ఆరు.. ప‌న్నెండు.. పందొమ్మిది తేదీల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో.. పోలింగ్ ప్ర‌క్రియ ముగుస్తుంది. అనంత‌రం మే 23న ఓట్ల లెక్కింపు చేయ‌టంతో సుదీర్ఘంగా సాగే ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి కానుంది. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో జ‌రిగే మూడు విడ‌త‌లకు సంబంధించిన పోలింగ్ వేళ‌ల్ని మార్చే విష‌యాన్ని ఈసీ ప‌రిశీలించాల‌ని దేశ అత్యున్న‌మ న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కోరింది.

ఈ నెల 5 నుంచి రంజాన్ నెల ప్రారంభం కానున్న నేప‌థ్యంలో పోలింగ్ రోజున మండే ఎండ‌లో పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు క్యూలో నిలుచునే ఓపిక ముస్లిం ఓట‌ర్ల‌కు ఉండ‌ద‌న్న అభ్య‌ర్థ‌న నేప‌థ్యంలో కోర్టు ఈ సూచ‌న చేసింది. రాజ‌స్థాన్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. ఇలాంటి వేళ‌.. ఉప‌వాసంలో ఉన్న ముస్లిం ఓట‌ర్లు క్యూ లైన్లో నిలుచోవ‌టం క‌ష్టంగా ఉంటుంద‌ని.. అందుకే వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా పోలింగ్ వేళ‌ల్ని ఉదయం 7 గంట‌ల‌కు మొద‌లుపెట్టి సాయంత్రం 5 గంట‌ల‌కు మార్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని కోరింది.

వాస్త‌వానికి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన వెంట‌నే.. షెడ్యూల్ మీద భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎన్నిక‌ల నెల‌.. రంజాన్ మాసం ఒకేసారి వ‌చ్చాయ‌న్న చ‌ర్చ జ‌రిగింది. అయితే.. రంజాన్ రోజు.. శుక్ర‌వారాల‌ను పోలింగ్ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చిన‌ట్లుగా ఈసీ పేర్కొంది. తాజాగా.. పోలింగ్ వేళ‌ల్ని మార్చాల‌న్న సుప్రీం సూచ‌న మేర‌కు ఈసీ సానుకూలంగా స్పందించే అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రి.. ఈసీ త‌న నిర్ణ‌యాన్ని ఎప్పుడు ప్ర‌క‌టిస్తుందో చూడాలి.


Tags:    

Similar News