అదే జ‌రిగితే..రిజ‌ల్ట్ పై లెక్క తేలేది మే24నే!

Update: 2019-05-15 07:23 GMT
సుదీర్ఘంగా సాగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌.. చూస్తుండ‌గానే తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రో విడ‌త పోలింగ్ జ‌రిగితే.. మొత్తం ఏడు విడ‌త‌ల పోలింగ్ పూర్తి కానుంది. పోలింగ్ పూర్తి అవుతోంది స‌రే.. ఫ‌లితాల మాటేమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

గ‌తంలో బ్యాలెట్ ప‌త్రాల‌తో పోలింగ్ జ‌రిగిన‌ప్పుడు.. ఓట్ల‌ను క‌ట్ట‌లు క‌ట్ట‌టం.. త‌ర్వాత వాటిని లెక్కించ‌టం చేసేశారు. దీంతో.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డికి రెండు నుంచి మూడు రోజులు ప‌ట్టేది. ఎప్పుడైతే ఈవీఎంలు ఎంట్రీ ఇచ్చాయో ఫ‌లిత‌ల వెల్ల‌డి వేగ‌వంత‌మైంది. ఓట్ల లెక్కింపు ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు మొద‌లైతే.. ప‌ది గంట‌ల‌కే గెలిచేది ఎవ‌ర‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేస్తున్న ప‌రిస్థితి.

ఆ మ‌ధ్య‌న జ‌రిగిన క‌ర్ణాట‌క‌.. ఈ మ‌ధ్య‌న జ‌రిగిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కూ క్లారిటీ రాని ప‌రిస్థితి. దీనికి కార‌ణం.. పోటాపోటీగా ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌టంతో పాటు.. రౌండ్ రౌండ్ కి మ‌ధ్య అధిక్య‌త‌ల‌ల్లో మార్పు కూడా కార‌ణం. ఈ నేప‌థ్యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు పోటాపోటీగా సాగిన ప‌క్షంలో ఫ‌లితాల వెల్ల‌డికి ఆల‌స్యం కావ‌టం ఖాయం.

దీనికి తోడు సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటి నుంచి ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ప్ప‌నిస‌రిగా ఐదు పోలింగ్  కేంద్రాల్లోని ఈవీఎంల‌కు వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను స‌రి చూడాల్సి ఉంటుంది. అంటే.. ఫ‌లితం లెక్క తేలినా.. లాట‌రీ ప‌ద్దతిలో అసెంబ్లీకి ఐదు పోలింగ్ కేంద్రాల చొప్పున ఈవీఎంలో పోలైన ఓట్ల‌కు.. వీవీ ప్యాట్ల‌లో న‌మోదైన ఓట్లను లెక్క తేల్చి.. రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం లేద‌న్న త‌ర్వాతే ఫ‌లితాల్ని వెల్ల‌డించాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌.. ఈ రెండింటి మ‌ధ్య వ‌చ్చిన వ్యత్యాసం ఉంటే లొల్లి షురూ అయిన‌ట్లే. ఇక‌.. మెజార్టీ త‌క్కువ‌గా ఉన్న చోట్ల ఇలాంటివి చోటు చేసుకుంటే మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి.

ఇదే జ‌రిగితే.. ఫ‌లితాల వెల్ల‌డి వెంట‌నే పూర్తి అయ్యే అవ‌కాశం లేదు. ఇక‌.. లోక్ స‌భ స్థానానికి 35 పోలింగ్ కేంద్రాల్లో న‌మోదైన ఈవీఎం ఓట్ల‌కు.. వాటి వీవీ ఫ్యాట్ల ఓట్ల లెక్క స‌రిపోవాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఓట్ల లెక్కింపు జ‌రిగే మే 23న ఫ‌లితాల స‌ర‌ళి తెలుస్తుందే త‌ప్పించి.. పూర్తిస్థాయి లెక్క‌లు తేలాలంటే మాత్రం మార్చి 24 వ‌ర‌కూ వెయిట్ చేయాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌.. త‌క్కువ మెజార్టీతో ఉన్న స్థానాల్లో కానీ ఈవీఎంల‌కు.. వీవీ ప్యాట్ల స్లిప్పుల‌కు మ‌ధ్య తేడా వ‌స్తే మాత్రం.. ఫ‌లితాల వెల్ల‌డి మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే వీలున్న‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News