శ్రీకాకుళం పెదపాడు రోడ్డులో ఆ షాపు మందుబాబులకు పండుగేనట

Update: 2021-03-28 09:30 GMT
మహా నగరాల్లో కనిపించే సీన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఏపీలోని శ్రీకాకుళం పెదపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన స్టోర్ ఇప్పుడు మందుబాబులకు మరింత హుషారును ఇస్తోంది. అన్ని బ్రాండ్ల మద్యంతో పాటు.. ఖరీదైన విదేశీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ సర్కారు భారీ ఎత్తున సరికొత్త మద్యం షాపుల్ని అందుబాటులోకి తీసుకొచ్చేశారు. పరిమితమైన బ్రాండ్లు మాత్రమే లభించటంతో మందుబాబులు తీవ్రమైన నిరాశకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు కోరుకునేదేమిటన్న విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘‘వాక్ ఇన్ లిక్కర్’’ పేరుతో కొత్త తరహా స్టోర్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా శ్రీకాకుళం పెద్ద పాడు రోడ్డులో.. బలగ ప్రాంతంలో రెండు భారీ స్టోర్ లను ఏర్పాటు చేశారు. ఈ షాపులకు నెలకు అద్దె రూ.లక్ష చెల్లిస్తుండటం గమనార్హం. ఈ హైఎండ్ మద్యం దుకాణంలో మిగిలిన వైన్స్ మాదిరి కాకుండా.. వినియోగదారుడు నేరుగా లోపలకు వచ్చి.. తమకు నచ్చిన ఖరీదైన బ్రాండెడ్ మద్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. బిల్లింగ్ కౌంటర్ వద్దకు తీసుకెళ్లొచ్చు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో అన్ని రకాల బ్రాండ్లు దొరకటం లేదన్న ఫిర్యాదుకు చెక్ పెట్టేలా ఈ షాపుల్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఇందులో కేవలం హాఫ్.. ఫుల్ బాటిళ్లు మాత్రమే లభిస్తాయి. క్వార్టర్.. చీప్ లిక్కర్ లాంటివి అమ్మరు. అన్ని వసతులతో పాటు.. చూసినంతనే మద్యాన్ని కొనుగోలు చేయాలన్నదే ఈ స్టోర్ట ఏర్పాటు ఆలోచనగా చెబుతున్నారు. క్రమపద్దతిలో మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తామన్న ప్రభుత్వం.. మద్యం తాగని వారికి సైతం ఆ ఆలోచన వచ్చేలా ఏర్పాటు చేసిన ఈ షాపుల వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి స్టోర్లను తెరవనున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం.
Tags:    

Similar News