పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?

Update: 2023-02-24 09:23 GMT
సీనియర్ చేతిలో వేధింపులకు గురైన పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి నాయక్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. వేధింపులకు తాళలేక.. తాను పని చేస్తున్న ఆసుపత్రిలోనే ప్రాణాంతక ఇంజెక్షన్ ను చేసుకున్న ఆమె ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆమెను వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించి వైద్యం చేస్తున్న సంగతి తెలిసిందే.  మరిప్పుడు ప్రీతి ఆరోగ్యం ఎలా ఉంది? ఆమెకు వైద్యం చేస్తున్న నిమ్స్ వైద్యుల టీం ఏం చెబుతున్నారు? అన్నది చూస్తే.. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆమెకు వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ.. జనరల్ ఫిజీషియన్.. కార్డియాలజిస్టుతో కూడిన ఐదుగురు డాక్టర్ల టీం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే.. డాక్టర్ ప్రీతిని తమ వద్దకు తీసుకొచ్చే సమయానికే పలు అవయువాలు పని చేయని పరిస్థితుల్లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆమెను వెంటిలేటర్ సపోర్ట్ తో వరంగల్ నుంచి నిమ్స్ కు తరలించారు.

ఆమె ఆరోగ్యం మెరుగవ్వాలని అందరూ ప్రార్థన చేయాలంటూ గవర్నర్ తమిళ సై పేర్కొనటం గమనార్హం. గురువారం రాత్రి ఆమె నిమ్స్ ను సందర్శించి.. ప్రీతికి వైద్యం అందిస్తున్న చోటుకు వెళ్లారు. అక్కడ వైద్యులతో మాట్లాడారు. ఆమెకు ఏమేం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ఒక డాక్టర్ గా తాను ప్రీతి పరిస్థితిని అర్థం చేసుకోగలనని.. ఇది చాలా బాధాకరమైన పరిస్థితిగా అభివర్ణించారు. 'నిమ్స్ వైద్యులు చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేం'' అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోవటం కోసం డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి నిమ్స్ కు వెళ్లారు. అక్కడి వైద్యులతో మాట్లాడారు.

అనంతరం మాట్లాడిన ఆయన.. డాక్టర్ ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉందని.. అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నదని.. కదలికలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా అధునాతన చికిత్సను అందిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఆమె ఆత్మహత్యయత్నంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా చూస్తే.. డాక్టర్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పాటు.. ఒకట్రెండు రోజుల్లో వైద్యుల వైద్యానికి ఆమె స్పందించే వైనానికి తగ్గట్లు ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అంతా మంచే జరగాలని కోరుకుందాం. ప్రీతి ఆరోగ్యం మెరుగుపడాలని ఆశిద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News