దుబాయ్ లో ఉగ్రవాదం ఉగ్గుపాలు.. జార్జియాలో ట్రైనింగ్.. అమృత్‌పాల్‌ మామూలోడు కాదు

Update: 2023-03-20 17:00 GMT
ఏడాది కిందటి వరకు సాధారణ వ్యక్తిగా ఉన్న అతడు.. ఇప్పుడు ఓ బలమైన నాయకుడిగా మారాడు. పెద్దఎత్తున ప్రజలను కూడగడుతూ భారత్ కు వ్యతిరేకంగా విషం ఎగజిమ్ముతున్నాడు. అతడే పంజాబ్ వారిస్ దే అధినేత అమృత్‌పాల్‌ సింగ్. స్వల్ప వ్యవధిలోనే అమృత్‌పాల్‌ ఈ స్థాయికి చేరడం ఎలా సాధ్యమైంది అనేది ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా మూడు రోజుల నుంచి అతడు తప్పించుకుతు తిరుగుతుండడంతో అమృత్‌పాల్‌ విషయం ఏమిటి అనేది చర్చ నడుస్తోంది. ఖలిస్థాన్ అనుకూల అమృత్‌పాల్‌ సింగ్ అంతా వ్యూహ ప్రకారమే చేసినట్లు స్పష్టమవుతోంది.

ఏడాది కిందటి వరకు సాధారణమే

ఇప్పుడంటే కరుడుగట్టిన ఖలిస్థానీ అనుకూలుడిగా, పక్కా సిక్కు మతస్థుడిగా కనిపిస్తుండొచ్చు. కానీ, ఏడాది కిందటి దాక అమృత్‌పాల్‌ జీవనం పూర్తిగా వేరు. దుబాయ్ లో కుటుంబానికి చెందిన రవాణా వ్యాపారంలో ఉండేవాడు. మత ఆచారమైన పగిడీని కూడా ధరించేవాడు కాదు. ఎప్పుడైతే.. 2021 ఫిబ్రవరిలో పంజాబీ గాయకుడు, నటుడు దీప్ సిద్ధూ మరణంతో కథ మలుపుతిరిగింది. సరిగ్గా అదే సమయంలో భారత్ కు తిరిగొచ్చిన అమృత్‌పాల్‌.. దీప్ సిద్ధూ స్థాపించిన వారిస్ పంజాబీ దే సంస్థను హైజాక్ చేశాడు.

దుబాయ్‌లో బ్రెయిన్‌ వాష్

పోలీసుల నుంచి తప్పించుకుని మూడు రోజులుగా తిరుగుతున్న అతడి చరిత్ర తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. అమృత్‌పాల్‌ పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో శిక్షణ పొందినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2012లో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసేందుకు దుబాయ్‌ వెళ్లిన అమృత్‌పాల్ కు‌.. పాకిస్థాన్‌ నుంచి పనిచేసే ఖలిస్థాన్‌ నేత లఖ్‌బీర్‌ సింగ్‌ రోడే సోదరుడు జస్వంత్‌, ఉగ్రవాది పరంజీత్‌ సింగ్‌ పమ్మాతో పరిచయం ఏర్పడింది. అక్కడే అతడి మెదడులోఖలిస్థానీ వాదం నూరిపోశారు. భారత్‌ వచ్చే ముందు అమృత్‌పాల్‌ జార్జియా వెళ్లాడని తెలుస్తోంది. అక్కడ ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు.

అనంతరం పంజాబ్‌లో అశాంతి రేపడానికి అడుగుపెట్టాడు. చాలా వేగంగా 'వారిస్‌ పంజాబ్‌ దే'ను హైజాక్‌ చేశాడు. మెరుపువేగంతో ఎదిగాడు. దీంతోపాటు సిక్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థతో కూడా అమృత్‌పాల్‌ కు సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్‌ నుంచి తరచూ పంజాబ్‌లోకి చొరబడే డ్రోన్ల ద్వారా అమృత్‌పాల్‌కు అవసరమైన ఆయుధాలు సమకూర్చినట్లు అనుమానాలు ఉన్నాయి. అమృత్‌పాల్‌కు యూకేలో ఉంటున్న అవతార్‌ సింగ్‌ ఖండా ప్రధాన హ్యాండిలర్‌గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అవతార్‌ సింగ్‌, పమ్మాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కాగా అమృత్‌ పాల్‌ సింగ్  నేపాల్‌ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అతడి కోసం భద్రతా దళాలు పంజాబ్‌ ను జల్లెడ పడుతున్నాయి.

ప్రత్యేక దళం ఏర్పాటు

ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌ (ఏకేఎఫ్‌) పేరిట అమృత్‌ పాల్‌ సొంతంగా ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏకేఎఫ్ పేరిట ఉన్న జాకెట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జల్లూపూర్‌ ఖేడా గ్రామంలోని అమృత్‌పాల్‌ ఇంటిపై ఏకేఎఫ్‌ అని రాసి ఉండటాన్ని దళాలు గుర్తించాయి. అమృత్‌పాల్‌ వాహనం నుంచి తూటాలు, తుపాకులను స్వాధీనం చేసుకొన్నారు. గత నెలలో ఈ దళం సహకారంతోనే అజ్‌నాలా స్టేషన్‌పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.

భార్యను కెనడా నుంచి రప్పించి

విదేశాల్లో ఉన్న పంజాబీ యువకులంతా స్వరాష్ట్రానికి వచ్చేయాలని అమృత్‌పాల్‌ కోరుతుంటాడు. అతడి భార్య యూకేలో స్థిరపడిన కిరణ్‌దీప్‌ కౌర్‌. ఫిబ్రవరిలో వీరి పెళ్లి అయింది. కిరణ్ ను పంజాబ్ లోనే ఉండిపోవాలని అమృత్‌పాల్‌ కోరాడు. విదేశాల నుంచి పంజాబీల తిరుగు వలసకు ఇది ఉపయోగపడుతుందని అతడు ఆమెకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. కిరణ్‌దీప్‌ కౌర్‌ ఇప్పటికే కెనడా వీసా కోసం దరఖాస్తు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. దీంతో అమృత్‌పాల్‌ కూడా నేపాల్‌ మీదుగా కెనడా పారిపోయేందకు ప్రయత్నించవచ్చని అనుమానిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News