ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలకి వార్నర్ ఫిదా అయినట్లున్నాడు. లాక్ డౌన్ కారణంగా అన్ని క్రికెట్ టోర్నీలు రద్దు కావడంతో ఇంటికే పరిమితమయ్యాడు ఈ స్టార్ క్రికెటర్. ఈ క్రమంలో తన ఫ్యాన్స్‌ను అలరించాలనే ఉద్దేశంతో టిక్ టాక్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన భార్యా పిల్లలతో కలిసి టిక్ టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన టాలీవుడ్ సినిమా పాటలు డైలాగ్స్ కు టిక్‌టాక్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల 'అల వైకుంటపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' 'రాములో రాములా' పాటకు తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత 'పోకిరి' సినిమాలో మహేష్ బాబు ఫేమస్ డైలాగ్ 'ఒక్కసారి కమిట్ అయితే..నా మాట నేనే వినను' అని చెప్పి ఆకట్టుకున్నారు. తాజాగా వార్నర్ చేసిన మరో టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ సృష్టిస్తోంది.
ఇప్పుడు డేవిడ్ వార్నర్ అమరేంద్ర బాహుబలి అవతారం ఎత్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించేలా చేసిన 'బాహుబలి' సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన డైలాగ్ చెప్పారు. 'బాహుబలి' గెటప్ లో తయారై తన కూతురితో కలిసి 'అమరేంద్ర బాహుబలి అను నేను..' అంటూ ఆకట్టుకున్నారు. 'ఈ సినిమా పేరు చెప్పండి చూద్దాం..' అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ని ట్యాగ్ చేసాడు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఇది వైరల్ అవుతోంది. కేవలం 3 గంటల్లో ఈ వీడియోను 7.5 లక్షల మంది వీక్షించారు. ఇక టాలీవుడ్ అభిమానుల నుంచి వార్నర్ కు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాటలకు, డైలాగ్ లకు టిక్ టాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీయల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్ కి కొన్నేళ్లపాటు హైదరాబాద్ తో తెలుగు వారితో అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వార్నర్ తెలుగు సినిమాలకు సంబందించిన వీడియోలు చేస్తుండటంతో తెలుగు అభిమానులు ఆయన్ని ప్రశంసిస్తున్నారు.