బీజేపీ మాట: 4 రంగాలు మినహా మొత్తం ప్రైవేటీకరిస్తాం

Update: 2021-02-08 05:30 GMT
తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా మారింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ప్రజలపై పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పన్నుల భారాన్ని మోపి పీల్చిపిప్పి చేస్తున్న మోడీ సర్కార్.. ఇప్పుడు నష్టాలు వచ్చినా.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి రెడీ అయ్యింది. తాజాగా ఈ విషయాన్ని బీజేపీ పెద్దలే కుండబద్దలు కొట్టడం విశేషం.

దేశంలో నాలుగు రంగాలు మినహా మొత్తం పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేటీకరణ చేస్తామని బీజేపీ సీనియర్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ప్రకటన చేశారు. ప్రైవేటుపరం చేసి లాభసాటిగా నడపాలన్నదే ఆర్థిక సంస్కరణ అని ఆయన కొత్త నిర్వచనం ఇచ్చారు. లాభసాటిగా ఉండే ప్రభుత్వ రంగాలను కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉందని స్పష్టం చేశారు. దీన్ని బట్టి బీజేపీ కార్పొరేట్లకు దోచిపెట్టడానికే రెడీ అయ్యిందని నిపుణులు, విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

ఏపీలోని విశాఖప్లాంట్ ను ఒక్కదాన్నే ప్రైవేటుపరం చేయాలని కేంద్రం ఆలోచన చేయడం లేదని.. నాలుగు సెక్టార్స్ మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలని ఆలోచన చేస్తున్నట్టు జీవీఎల్ బాంబు పేల్చారు.

అటామిక్ ఎనర్జీ, పెట్రోలియం, ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పవర్ సెక్టార్ రంగాలు తప్పించి మిగిలిన వాటిలో కేంద్రం బిజినెస్ చేయదని చెప్పారు. ఈ ప్రక్రియ నుంచి ఆర్ఐఎన్ఎల్ ను తప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. ఏపీలోనూ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని జీవీఎల్ తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తారని తెలిపారు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగితే టీడీపీ ఖాళీ అవుతుందని చెప్పారు.

అన్ని ప్రైవేటీకరిస్తూ.. కార్మికులందరినీ రోడ్డున పడేస్తూ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అంత ధీమాగా చెబుతున్న జీవీఎల్ మాటలు విని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.ఆ ప్రైవేటీకరణ జ్వాలల్లోనే బీజేపీ కొట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News