ఈసారికి ఎండాకాలం అయిపోయినట్లేనట.. ఎంత చల్లటి మాటో కదా?

Update: 2023-04-27 15:00 GMT
మండే ఎండలతో ఠారెత్తిపోతున్న పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో మరెంత ఇబ్బందులు తప్పవన్న ఆందోళన పెరిగింది. దీనికి తోడు గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. వర్షాలు తక్కువగా ఉంటాయన్న అంచనాలతో మండే వేసవిని గుర్తు చేసుకొని హడలిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అనూహ్యంగా మారిన వాతావరణం రెండు తెలుగురాష్ట్రాల్ని కూల్ కూల్ గా మార్చింది. నడి వేసవిలో విరుచుకుపడిన వానల కారణంగా పంట నష్టం భారీగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

అనూహ్యంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు.. ఆగ్నేయ/నైరుతి గాలుల కారణంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నారు.

రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురవటమే కాదు.. మే మొదటి వారం వరకు వాతావరణం చల్లగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ఒక మోస్తరు వర్షాలతో పాటు.. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే వీలుందని చెబుతున్నారు.

గడిచిన మూడేళ్లలో ఏప్రిల్ లో ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల వరకు నమోదైనా మధ్యలో రెండు.. మూడు రోజులు అకాల వర్షాలు కురవటం తెలిసిందే. గత ఏడాది మేలో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావటం తెలిసిందే. ఈ ఏడాది ముందే వచ్చేసిన వేసవి కాలంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి.

అనూహ్యంగా ఏప్రిల్ మూడో వారంలో కురిసిన వర్షాలు వాతావరణంలో మార్పులకు కారణమైంది. మే మొదటి వారం వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని.. దీంతో.. ఈసారి వేసవిలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే వీలుందన్న మాట వినిపిస్తోంది.

దీనికి కారణం లేకపోలేదు. మే 9-12 మధ్య బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే వీలుందని.. ఇది మయన్మార్ వైపు వెళ్లినా ఇక్కడి ఉష్ణోగ్రతల మీద ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. దీంతో.. మే రెండో వారంలోనూ అధిక ఉష్ణోగ్రతలకు వీలు ఉండదని చెబుతున్నారు. మధ్యలో ఒకట్రెండు రోజులు ఎండలు ఎక్కువగా అనిపించినా.. వర్షాలు మాత్రం కురవటం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఏడాదికి మండే ఎండలు దాదాపుగా వెళ్లిపోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Similar News