మొదలైన పెళ్లిళ్ల సీజన్ ... కళకళలాడుతున్న పెళ్లి మండపాలు !

Update: 2020-10-29 23:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా లేని పెళ్లిళ్ల సందడి మళ్లీ మొదలుకానుంది. దాదాపుగా మూడు నెలల పాటు పెళ్లిళ్లు చేసుకోవడానికి మంచి ముహుర్తాలు జనం శుభకార్యాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అటు కొన్ని నెలలుగా ఆశగా ఎదురుచూస్తున్న ఫంక్షన్‌ హాల్స్ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా దెబ్బకు మూతపడిన కళ్యాణ మండపాలు తిరిగి ముస్తాబవుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచి కొద్దిమందితోనే పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉండటంతో వివాహాల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కాస్త కోలుకోవటం ఫంక్షన్ హాళ్లకు అనుమతి రావటంతో వైభవంగా వివాహ వేడుకలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.

ఇప్పటినుంచి మూడు నెలల దాకా శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని చెప్తున్నారు. 2021 జనవరి రెండో వారం నుంచి నాలుగు నెలలపాటు ముహూర్తాలకు బ్రేక్‌ పడనుండడంతో ఈ సీజన్లో పెళ్లిళ్లు చేసుకునేలా చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. అక్టోబర్‌ 29, 30, 31 నవంబరు 4, 11 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు. ఆ తర్వాత కార్తీక, మార్గశిర మాసాల్లోనూ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. 2021 జనవరి 2, 7 తేదీల్లో మంచి ముహూర్తాలుండగా జనవరి 16 నుంచి మౌఢ్యమి కారణంగా నాలుగు నెలల గ్యాప్ రానుంది. ఆ కారణంగా గత కొన్నిరోజులుగా పెళ్లి ముహూర్తాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ సీజన్ లో పెళ్లి జరిపించడానికి సమాయత్తం అవుతున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా దెబ్బతిన్న ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ప్రస్తుత శుభముహర్తాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కరోనా  నిబందనలు పాటిస్తు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే ఆరు నెలలుగా ఫంక్షన్ హాల్ తెరవకపోవడంతో చాలా వరకు ఫర్నిచర్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జనమంతా శుభకార్యాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదని , జాగ్రత్తలు తీసుకోని , శుభకార్యాలు చేసుకోవాలని చెప్తున్నారు.
Tags:    

Similar News