అన్నాడీఎంకేను ఆధీనంలోకి తెచ్చుకుంటా ... శశికళకి చెన్నైలో ఘనస్వాగతం !

Update: 2021-02-09 09:30 GMT
ఆక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన చిన్నమ్మ ఆ శిక్ష పూర్తికావడంతో జనవరి 27న విడుదలైన దివంగత సీఎం  జయలలిత నెచ్చెలి వీకే శశికళ సోమవారం తమిళనాడుకు చేరుకున్నారు. ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరిన ఆమెకు దారిపొడువునా అభిమానులు నీరాజనాలు పట్టారు. చైన్నైకు చేరుకునే క్రమంలో అక్కడక్కడా ఆమె మీడియాతో మాట్లాడారు. అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. అమ్మకు తానే నిజమైన వారుసురాలినని సంచలన ప్రకటన చేశారు.  అన్నాడీఎంకేలోని కోట్లాది మంది కార్యకర్తలను కాపాడేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. చెన్నైకు చేరే క్రమంలో దారిపొడవునా 66 చోట్ల ‘అమ్మ మక్కల్‌ మున్నేత్ర కళగం’ పార్టీ ప్రముఖులు, కార్యకర్తల స్వాగత సత్కరాలను అందుకున్నారు. శశికళ మేనల్లుడు నాయకుడు దినకరన్‌ నాయకత్వంలో 30 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తాను అన్నాడీఎంకే పార్టీ జెండాను ఉపయోగించడంపై మంత్రులు ఫిర్యాదు చేయడం వారిలో తన రాకవల్ల కలుగుతున్న భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

తన రాకతో సీఎం, మంత్రుల్లో వణుకు ప్రారంభమైందన్నారు. నన్ను అణచివేయాలకుంటే కేవలం అది ప్రేమతోనే సాధ్యం తప్పితే అధికార బలంతో సాధ్యంకాదన్నారు. అందరం ఒక్కటై, ప్రత్యర్థిని ఎదుర్కొని అధికారంలోకి వచ్చి అమ్మ, ఎంజీఆర్‌ ఆశయాలను నిలబెడతామని చెప్పారు. సోమవారం ఉదయం 8 గంటలకు రిసార్టు నుంచి చెన్నైవైపు కారులోనే బయలుదేరారు. 10.45 గంటలకు ఆమె కారు తమిళనాడు సరిహద్దుల్లోకి ప్రవేశించగానే పోలీసులు ఆమె కారును అడ్డుకుని అన్నాడీఎంకే పతాకాన్ని తొలగించాలని కోరగా శశికళ నిరాకరించారు. అన్నాడీఎంకే తరపున పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఒక నేత ‘అది నా అధికారిక కారు, అడ్డుకునే హక్కు లేదు’అని వాదించడంతో పోలీసులు వెనక్కితగ్గారు.

 తమిళనాడులో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో శశికళ ఎంట్రీతో పార్టీలో చీలికలు తప్పవని అధిష్టానం కలవరపడుతోంది. అందుకే.. శశికళ వెంట పార్టీ నేతలెవరూ వెళ్లకుండా అన్నాడీఎంకే అప్రమత్తమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న BJPతో, స్థానికంగా PMKతో కలిసి అన్నాడీఎంకే ఈ ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ సందర్భంలో సీట్ల సర్దుబాటుపై కూడా ఆ పార్టీ సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. అయితే.. శశికళ పొలిటికల్ రీఎంట్రీతో అన్నాడీఎంకేకు కొత్త తలనొప్పులు తప్పేలా లేవు.
Tags:    

Similar News