మరో చెత్త సంప్రదాయానికి తెర తీసిన దీదీ

Update: 2021-02-06 14:30 GMT
మంచి చేయటం కష్టం. చెడు చేయటం చాలా ఈజీ. రాజకీయ కక్షల్ని మనసులో పెట్టుకొని.. అనుచితంగా వ్యవహరించటం.. ఇప్పటివరకు ఫాలో అయ్యే విధానాల్ని తోసి రాజనటం లాంటివి ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి చెత్త పనే చేశారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోనున్న ఆమెకు.. రాష్ట్ర గవర్నర్ కు మధ్యనున్న పంచాయితీ తెలిసిందే.

వ్యవస్థల మధ్య ఎన్ని ఇష్యూలు ఉన్నప్పటికీ.. కొన్ని విధానాల్ని పక్కకు పెట్టేయటం కొత్త సమస్యలకు తెర తీయటమే కాదు.. రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందికర పరిణామాలకు అవకాశం కల్పించినట్లైంది. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది మమత సర్కారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే చేయకూడని తప్పు చేసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించాల్సిన అవసరం ఉంది.

అందుకు భిన్నంగా బడ్జెట్ ప్రారంభ సమావేశానికి గవర్నర్ ను ఆహ్వానించకుండా కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఈ తీరును విపక్ష ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ.. వామపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బెంగాల్ గవర్నర్ కు.. ముఖ్యమంత్రికి మధ్య సంబంధాలు సరిగా లేని నేపథ్యంలో.. ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. దీనికి తోడు.. ఎన్నికల ఏడాది కావటంతో తన వివాదాస్పద నిర్ణయంతో ఆమె హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పనులు దీదీ మాత్రమే చేయగలరన్న అపవాదును మూటగట్టుకున్నారు.

 ఇదంతా ఒక ఎత్తు అయితే.. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి మమత నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. తనపై విశ్వాసం ఉంచాలని.. తాను అంకిత భావంతో నిస్వార్థంగా సేవలు అందిస్తానని రవీంద్రనాథ్ ఠాగూర్ కవితతో మమత తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించటం గమనార్హం. అంకిత భావంతో పని చేయటం అంటే.. రాజ్యాంగ విధానాల్ని పక్కకు పెట్టేయటమేనా? బడ్జెట్ ప్రసంగం వరకు బాగానే ఉన్నా.. గవర్నర్ ను ఆహ్వానించకపోవటం మాత్రం సరికాదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. మరి.. విమర్శలకు ఆమె ఏమని బదులిస్తారో చూడాలి.
Tags:    

Similar News