హైదరాబాద్ లో రాయలసీమ వారి అభివృద్ధి లేదా ఎమ్మెల్యేగారు?

Update: 2022-04-30 04:29 GMT
ఏపీ రెండు ముక్కలు కావటానికి బోలెడన్ని కారణాలు చెబుతుంటారు. అందులో చాలా మంది నోటి నుంచి విపిపించే మాట గుంటూరు.. ప్రకాశం.. క్రిష్ణా జిల్లాలకు చెందిన వారు వ్యవహరించిన తీరు కూడా తెలంగాణ ప్రాంతీయుల మనసుల్ని గాయపరిచేలా ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. నిజానికి అలాంటివి ఏమీ లేనప్పుడు.. అలాంటి మరకల్ని వీలైనత త్వరగా తుడిపేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటివి జరగలేదు.. కనీసం విభజన తర్వాత అయినా ఇలాంటి ప్రచారంపై ఏదైనా దిద్దుబాటు మొదలైందా? అంటే లేదనే మాట వినిపిస్తూ ఉంటుంది.

మిగిలిన వారి కంటే తాము ఉన్నతులమని ఉత్తరాది వారికి ఉంటుందో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. ఈ భావన పైన చెప్పిన మూడు జిల్లాలు.. అందునా క్రిష్ణా.. గుటూరు జిల్లాల్లో కాస్త ఎక్కువగా ఉందన్న ఆరోపణ ఉంది. ఇలాంటివి తెలీనప్పుడు ఏమీ చేయలేం. కానీ.. తెలుస్తున్నప్పుడు ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిదులు కావొచ్చు.. ప్రజలు కావొచ్చు.. గతంతో పోలిస్తే కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ విభజన తర్వాత.. ఏపీ మరోసారి ముక్కలు కాకుండా ఉండాలంటే.. అందరూ కలిసి కట్టుగా నడవాల్సిన అవసరం ఉంది.

ఇందులో మేం గొప్ప? వాళ్లు ఎలాంటి గొప్పతనం లేని వాళ్లు? లాంటి మాటలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కారణమవుతుంది. తెలంగాణలో ఉత్తర.. దక్షిణ తెలంగాణ అన్న రెండు భాగాలు ఉన్నప్పటికి.. వారి మధ్య సంప్రదాయాలు.. కొన్ని కట్టుబాట్లు.. యాస లాంటివి తేడాలున్నా.. తామంతా తెలంగాణ అనుకుంటారే తప్పించి.. విడిగా అనుకోరు. అలా ఫీల్ కారు. దరిద్రమేమంటే.. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి ఉంది. సీమ ఒకలా.. కోస్తా మరోలా.. ఉత్తరాంధ్ర ఇంకోలా ఉండటం కనిపిస్తుంది. ఏ సందర్భంలోనూ ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన వారి మధ్య భావోద్వేగంతో మేమంతా ఒక్కటే అన్న మాట వినిపించదు.

అతకని మనసులతో కలిసి బతికే జంటలా వారి ప్రయాణం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి విషయాల మీద అవగాహన లేనప్పుడు ఓకే. కానీ.. ఇప్పుడు అలాంటి దరిద్రాలు చాలానే ఉన్నాయన్న విషయం తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో అర్థమయ్యాక.. సున్నితంగా ఆలోచించాలే కానీ సంకుచితంగా వ్యవహరించకూడదు. ఎందుకంటే.. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కోట్లాది మంది గమనిస్తారన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.

శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన క్రెడాయ్ సదస్సులో మంత్రి కేటీఆర్ ఏపీని ఉద్దేశించి.. చేసిన వ్యాఖ్యలు అగ్గి పుట్టించటమే కాదు.. వైసీపీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా నోటికి పని చెప్పేశారు. ఈ వ్యాఖ్యల్లో కొందరి నోటి నుంచి వచ్చిన కామెంట్లు.. ఏపీలోని మిగిలిన ప్రాంతాల వారి మనసుల్ని గాయపర్చటం గమనార్హం. ఎవరి దాకానో ఎందుకు.. కేటీఆర్ పై విరుచుకుపడిన కోస్తా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. "ఏపీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నీళ్లు.. కరెంటు.. రోడ్లు ఉన్నాయో లేదో విజయవాడ వచ్చి చూడండి. కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ డెవలప్ అయ్యింది. ఇప్పుడు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు.

కేటీఆర్ కు కౌంటర్ సంధించే వేళలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా కోట్ చేయకుండా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని.. రాష్ట్ర ప్రజలందరిని కలిపి.. వారి తరఫున తిట్టినట్లుగా అయినా తిట్టాలి కదా? అదేమీ లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం వల్ల సీమ.. ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గాయపడవా? ఎక్కడిదాకానో ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో కావొచ్చు.. విభజన తర్వాత ఏపీలోనూ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏ ప్రాంతానికి చెందిన వారు? అన్న  ప్రశ్నను సంధిస్తే వచ్చే ఆన్సర్.. రాయలసీమ. అంత వరకు ఎందుకు.. మల్లాది విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి చెందిన వారు సీమ ప్రాంతానికి. ఆయన నాయకత్వంలో పని చేస్తున్న మల్లాది విష్ణుకు.. ఈ కోస్తా మీద ఉండే దరిద్రపుగొట్టు అభిమానం ఏమిటి? ఇలాంటి మాటలే ముల్లుల మాదిరి మారి.. మనసుల్ని విపరీతంగా గాయపరుస్తాయన్న సత్యాన్ని మరిస్తే.. మరోసారి ఏపీ ముక్కలు కాదన్న గ్యారరెంటీ ఉండదన్న విషయాన్ని గుర్తించాలి.
Tags:    

Similar News