ఆంధ్రోళ్లంటే అంత ఎటకారమా? స్నేహితుడి పేరుతో ఈ మాటలేంది కేటీఆర్?

Update: 2022-04-29 10:31 GMT
విడిపోదాం.. ఎవరి బతుకు వాళ్లు బతుకుదాం అనుకున్నప్పుడు అలానే ఉండాలే తప్పించి.. విడిపోయిన తర్వాత ప్రతి సందర్భంలోనూ ఆ ప్రస్తావన తీసుకొచ్చి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబబు? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆయన కుమారుడు కేటీఆర్ కానీ తరచూ ఆంధ్రా పరిస్థితి.. ఆంద్రోళ్ల గురించి వాళ్లు తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరి గొప్పతనం గురించి వారు చెప్పుకునే క్రమంలో అవతల వారి ప్రస్తావన తీసుకొచ్చి.. అక్కడి లోపాల్ని ఎత్తి చూపించి తమ గొప్పతనం గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నంతరచూ జరుగుతోంది.

కలిసి ఉన్నప్పుడు ఒకరిగురించి ఒకరు మాట్లాడుకోవటంలోనూ.. చర్చలు చేసుకోవటంలో తప్పు లేదు. తేడా వచ్చి ఎవరి దారి వారిది అనుకున్నప్పుడు.. అదే పనిగా ప్రస్తావన తేవటంలో అర్థం లేదు. కానీ.. ఘనత వహించిన సీఎం కేసీఆర్ కానీ ఆయన కుమారుడు కేటీఆర్ కానీ అదే పనిగా ఏపీ ప్రస్తావన తేవటం.. ఏపీ వెనుకబడి పోయినట్లుగా చెప్పి.. అక్కడ దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పటంఈ మధ్యన ఎక్కువైంది. సాయం చేయలేని చేతులు.. సమస్యల గురించి ప్రస్తావించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఈ విషయాన్ని కేసీఆర్ ఆయన కుమారుడు మర్చిపోతున్నట్లుగా ఉంది. తాజాగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో క్రెడాయి నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గొప్పతనం గురించి భారీగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ సమర్థతో రాష్ట్రంలో ఆర్నెల్లలో విద్యుత్ సమస్యను అధిగమించినట్లుగా పేర్కొన్నారు. ఇళ్లకు.. వ్యవసాయానికి.. పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన తన మిత్రుడు చెప్పిన ఏపీకి సంబంధించిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చారు. 'పక్క రాష్ట్రంలో కరెంటు.. నీళ్లు లేవు. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. తన ఊరు నుంచి హైదరాబాద్ కు వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లుగా తనకు తెలిసినవారు చెప్పినట్లుగా వెల్లడించారు. 'అక్కడకి వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూూసి వస్తే మీరు మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంతమందికి నచ్చక పోవచ్చు కానీ.. అవన్నీ వాస్తవాలు" అంటూ కేటీఆర్ చెప్పిన మాటల్ని చూస్తే.. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది.

కలిసి ఉన్నప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి ఉంది.. తెలంగాణలో ఇలా ఉందంటూ మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు.. ఆంధ్రా ప్రాంతాన్ని.. అక్కడి అధికారపక్షంపై విమర్శనాస్త్రాల్ని సంధించినట్లుగా చెబుతున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలంటే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావాలన్న కోరికతో ఆ దిశగా పావులు కదిపిందెవరు? అందుకు అవసరమైన రాజకీయ.. ఆర్థిక పరమైన సాయం చేసిందెవరికి అన్నది తెలియంది కాదు. అంటే.. ఏపీలో తాము కోరుకున్న వారు అధికారంలోకి వస్తే.. ఏపీ రాజకీయం తీరు మారుతుందన్న విషయాన్ని కేసీఆర్ సరిగానే అంచనా వేసినట్లుగా కనిపిస్తోంది.

అలాంటప్పుడు ఏపీ కంటే తాము ముందడుగులో ఉంటాం కాబట్టి.. తమను తాము గొప్పగా ప్రజెంట్ చేసుకోవటం ద్వారా.. ఏమీ చేయకుండానేలాభం పొందొచ్చన్న వ్యూహంలోనే ఇవన్నీ చేశారన్న భావన కలుగక మానదు. ఇదంతా ఎందుకంటే.. చేసేదంతా చేసి.. ఏపీని ఎక్కెసం చేయటం.. అవసరమైనప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాక్షస పాలన పేరుతో విలన్ గా చిత్రీకరించటం.. ఇలా విడిపోయిన తర్వాత ఏదో ఒక పేరున ఏపీని ఆడిపోసుకోవటం కేసీఆర్.. కేటీఆర్ లకు అలవాటుగా మారిందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. ఆంధ్రోళ్లు..ఆంధ్రా ప్రాంతం ఎలా తగలబడితే మీకెందుకు కేటీఆర్? అని ఏపీప్రజలు అనాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News