బెంగాల్ లో అమిత్ షా ఏం చేశారు?

Update: 2020-12-20 04:31 GMT
టార్గెట్ చేస్తే.. దాని అంతు చూడాలన్నట్లుగా వ్యవహరించే మోడీషాలు.. తమకున్న ఇమేజ్ కు తగ్గట్లే తాజాగా వ్యవహరించారని చెప్పాలి. వారికి ఒక పట్టాన కొరుకుడుపడని బెంగాల్ కోటను సొంతం చేసుకోవటానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించిన విషయం తెలిసిందే. మరికొద్ది నెలల్లో బెంగాల్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరేలా చేయటానికి పక్కాప్లాన్ రూపొందించిన సంగతి తెలిసిందే.

ఆపరేషన్ కమల్ పేరుతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చిన మోడీషాలు.. తాజాగా బెంగాల్ లో ఆ పనిని కీలక దశకు తెచ్చారని చెప్పాలి. తాజాగా తన రెండు రోజుల పర్యటనలో భాగంగా.. మొదటిరోజును అనుకున్న దాని కంటే డబుల్ విజయాన్ని ఆయన సాధించారు. రాజకీయంగా అధికారపక్షానికి దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వటమే కాదు.. భావోద్వేగాన్ని రగిలించి.. బెంగాలీలను బీజేపీకి దగ్గర చేసేలా చేశారు. అదే సమయంలో మమతా బెనర్జీకి గట్టి హెచ్చరికలు పంపటమే కాదు.. అధికారపార్టీలో గుబులుపుట్టేలా చేశారు. ఎందుకైనా మంచిది.. ముందే బీజేపీలోకి వెళ్లిపోతే పోలా.. అన్న భావనను కలిగించేలా చేశారు.

బెంగాల్ అధికారపార్టీలో మొన్నటివరకు కీలకంగా వ్యవహరించిన  సువేందు అధికారిని విజయవంతంగా పార్టీలోకి చేర్చుకోవటమే కాదు.. మరో ఐదుగురు అధికారపార్టీ ఎమ్మెల్యేలను.. ఇద్దరు సీపీఎం.. సీపీఐ.. కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటం ద్వారా.. త్వరలో జరిగే ఎన్నికలు మామూలుగా ఉండవన్న సంకేతాల్ని ఇచ్చేశారు. సువేందు అధికారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు.. ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.

‘‘దీదీ..! ఇది కేవలం ఆరంభం మాత్రమే... కొద్ది రోజుల్లో బెంగాల్‌లో రాజకీయ సునామీ తప్పదు. ఎన్నికల వేళకు పార్టీలో చివరకు మిగిలేది మీరొక్కరే. ఈరోజు చెబుతున్నా... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 పైగా సీట్లు గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. రాజకీయ హింస, రెచ్చగొట్టే ధోరణి ఇక టీఎంసీకి ఎంతమాత్రం లాభించవు’’ అని గర్జించిన అమిత్ షా.. తమపై దీదీ చేస్తున్న విమర్శల్ని సమర్థవంతమైన వాదనతో తిప్పి కొట్టారు. వలసల్ని బీజేపీ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణల్ని ఆయన ప్రస్తావిస్తూ.. ‘‘1998లో మీ పార్టీ ఏది? కాంగ్రెస్‌ కాదా? మీరు అధికారంలోకొచ్చాక ఎంతమంది కాంగ్రెస్‌, లెఫ్ట్‌ నేతలు టీఎంసీలో చేరలేదు’’ అని ప్రశ్నించటం ద్వారా సరైన షాకిచ్చారని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పార్టీలో చేరిన సువేందు చెప్పిన వ్యాఖ్యలు బెంగాలీల మనసుల్లో దీదీపై ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నాయి. ‘‘నాకు కొవిడ్‌ వచ్చినపుడు మమత ఒక్కసారి కూడా ఫోన్‌ చేయలేదు. అమిత్‌ షా రెండు మార్లు ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. దీదీ దగ్గర ఎప్పుడు కలుగని గౌరవ.. మర్యాదల్ని బీజేపీలో పొందాను’’ అని పేర్కొన్నారు. తన రెండు రోజుల పర్యటనలో సెంటిమెంట్ తో పాటు.. హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసే ప్రయత్నం చేశారు.

సిద్ధేశ్వరీ ఆలయంలో పూజలు.. వివేకానంద సమాధి వద్ద నివాళులు అర్పించి.. భరతజాతి ముద్దుబిడ్డ వివేకానందుడన్నారు. మిడ్నాపూర్ లోని స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ వారసుల ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించటమే కాదు.. వందేమాతనం అంటూ 1908లో ఉరికొయ్యల్ని ముద్దాడిన బోస్ ఈ దేశ యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.  ఇక.. ఈ రోజు శాంతినికేతన్ కు వెళ్లి ఠాగూర్ కు నివాళులు అర్పించనున్నారు. మొత్తంగా తనరెండు రోజుల పర్యటనతో అమిత్ షా.. మమత కోటకు పగుళ్లు వచ్చేలా చేయటంలో కీలక అడుగు వేశారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News