ఆదివారం హైటెక్ సిటీలో ఏమైంది? 3కి.మీ. మేర ట్రాఫిక్ జాం

Update: 2021-06-06 07:30 GMT
కరోనా వేళ.. అందునా ఆదివారం. ఇలాంటి వేళ.. హైదరాబాద్ లోని మిగిలిన ప్రదేశాలు అంతో ఇంతో బిజీగా ఉండొచ్చు కానీ.. హైటెక్ సిటీ వైపు హడావుడే ఉండదు. విశాలమైన రోడ్లు ఖాళీగా ఉండటం ఖాయం. అలాంటిది ఈ రోజు (ఆదివారం) ఉదయం ఆరు గంటల నుంచి ఆ రోడ్లు మొత్తం విపరీతమైన రద్దీతో ఉన్నాయి. అంతేనా.. ఉదయం ఎనిమిది గంటల సమయానికి తీవ్రమైన ట్రాఫిక్ నెలకొనటమే కాదు.. భారీ జాం కావటం గమనార్హం. దాదాపు మూడు.. నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

దీనికి కారణం ఏమిటంటే.. హైటెక్స్ లో భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటమే. హైదరాబాద్ లోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం.. టీకా కోసం బయటకు వచ్చిన వారి కారణంగా ఈ జాం నెలకొంది. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారంతా కార్లలోనే రావటం.. అందరి గమ్యస్థానం హెటెక్స్ కావటంతో తీవ్రమైన ఒత్తిడిని నెలకొంది. ఈ ఒక్కరోజున.. అక్కడ 40వేల మందికి వ్యాక్సిన్ వేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. డబ్బులు చెల్లించి వేయించుకునే ఈ టీకా కార్యక్రమానికి ఇంత భారీగా ప్రజలు హాజరు కావటం గమనార్హం. కొన్ని భారీ గేటెడ్ కమ్యునిటీలతో పాటు.. ఐటీ సంస్థలు సైతం తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ వేయిస్తుండటంతో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనట్లుగా చెబుతున్నారు.

మెడికవర్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ఈ భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం ఏడు గంటలకే ప్రారంభించారు. ఉదయాన్నే వచ్చేసి వ్యాక్సిన్ వేసుకొని వెళ్లిపోదామన్న ఉద్దేశంతో హైటెక్ సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారు రావటంతో ట్రాఫిక్ జాం నెలకొంది. కరోనా మొదటి వేవ్ లో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో గడిచిన ఏడాదిన్నరగా హైటెక్ సిటీ.. మాదాపూర్ ప్రాంతాల్లో ఎలాంటి ట్రాపిక్ జాం నెలకొన్నది లేదు. తాజా కార్యక్రమం పుణ్యమా అని భారీ జాం నెలకొంది. రోడ్లు మొత్తం కళకళలాడుతున్నాయి. అయితే.. ట్రాఫిక్ పెద్దగా ఉండదని అనుకున్న చాలామందికి అక్కడి రద్దీకి షాక్ తినే పరిస్థితి.
Tags:    

Similar News