నిర్మల బడ్జెట్ తో ఏపీకి ఒరిగిందేంటి... ?

Update: 2022-02-01 11:30 GMT
కేంద్ర బడ్జెట్ లో మరోసారి ఏపీకి తీరని నిరాశ కలిగింది. బడ్జెట్ అంటే ఏదో చేస్తారని ఎదురుచూపులు ఆనక ఉసూరుమనడాలు ఎపుడూ జరుగుతోంది. ఒక విధంగా చూస్తే ఈ నిరాశ అలవాటుగా మారింది అని కూడా చెప్పాలేమో. ఇపుడు కూడా కధ షరా మామూలుగానే సాగిపోయింది. ఇదిలా ఉంటే ఏపీ విభజన వల్ల గాయపడిన రాష్ట్రం. అన్ని విధాలుగా ఆర్ధికంగా కృంగి పోయి ఉంది. ప్రత్యేక హోదా అంటూ ఎనిమిదేళ్ళ పాటు కేంద్ర పెద్దలు గ‌డిపేశారు.

అది ముగిసిన అధ్యాయమని కేంద్రం ఏనాడో పక్కన పెట్టేసింది. అయినా సరే కేంద్రాన్ని తాము అడుగుతూనే ఉంటామని ఏపీలోని వైసీపీ సర్కార్ చెబుతూ వచ్చింది. కానీ చూస్తే హోదా లేదు, అదే టైమ్ లో ప్రత్యేక ప్యాకేజి కింద ఏపీకి ఎంతో చేస్తామని చెబుతున్న హామీలు కూడా కాకుండా పోయాయి.

నిజానికి ప్రత్యేక హోదా అంటూ ప్రాకేజి వల్ల రావాల్సిన ఆర్ధిక ప్రయోజనాలను ఏపీ ప్రభుత్వం పోగొట్టుకుంటుందా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక తాజా బడ్జెట్ లో కేంద్రం ఏపీకి ఏమీ లేవని చెప్పేసింది. పోలవరం ప్రాజెక్టునకు ఏ మాత్రం నిధులు ఇస్తున్నారు అన్నది లేదు, అలాగే సవరించిన అంచనాలు ఆమోదించమని కోరుతున్నా కూడా అది పట్టించుకున్నట్లుగా తాజా బడ్జెట్లో అయితే ఏమీ  లేదు.

ఏపీలో రాజధాని లేదు, అదే టైమ్ లో ఢిల్లీని తలదన్నేలా రాజధానిని నిర్మించి ఇస్తామనిఆనాడు బాగా గొప్పగా  చెప్పిన బీజేపీ పెద్దలు ఏమీ ఇచ్చిందీ లేదు. కనీసం తాజా బడ్జెట్ లో అయినా ఎంతో కొంత ఇచ్చారా అంటే లేదు అనే చెప్పాలి. మరో వైపు చూస్తే ఏపీలోని వెనకబడిన జిల్లాలకు అభివృద్ధి కోసం నిధులు ఇస్తామని చెప్పారు. కానీ మొదటి మూడేళ్ళకే దాని మీద నాలిక మడతేశారు.

మరో వైపు చూస్తే ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు కూడా ఏమీ ఇచ్చినది లేదు. మొత్తంగా చెప్పుకుంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏపీకి రిక్త హస్తమే ఇచ్చింది అని చెప్పాలి. మరి ఇవన్నీ చూస్తూంటే ఏపీ మరోసారి బడ్జెట్ మీద ఆశపెట్టుకుని మోసపోయింది అని చెప్పాల్సి ఉంటుందేమో. ఇక ఏపీకి సంబంధించి ఏమీ ఇవ్వకపోయినా ఇక్కడ గెలిచిన ఎంపీలు ఏమీ చేయడంలేదు అన్న విమర్శలు అయితే ప్రజల నుంచి ఉన్నాయి.
Tags:    

Similar News