రాహుల్ ఫోన్‌.. రాజ‌కీయ దుమారం.. ఏం జ‌రిగింది?

Update: 2023-03-03 16:05 GMT
కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ వ్య‌క్తిగ‌త ఫోన్‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం టాప్ చేస్తోందా? ఈ ఫోన్‌లో వివాదాస్ప‌ద స్పైవేర్‌.. పెగాస‌స్‌ను జొప్పించిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాహుల్ గాంధీ. తన ఫోన్లో పెగాసస్ సాఫ్ట్వేర్ ఉందని.. ఇలా చాలా మంది నాయకుల ఫోన్లలో ఉందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా.. ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ముఖ్యంగా ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు ఉన్న కేంబ్రిడ్జ్ యూన‌నివ‌ర్సిటీలో చేసిన ప్ర‌సంగంలో పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.

దీంతో బీజేపీ రాహుల్‌ వ్యాఖ్య‌లపై తీవ్ర విమ‌ర్శ‌లు సంధించింది. ఇక రాహుల్‌ విష‌యానికి వ‌స్తే.. అంత‌ర్జా తీయంగా మోడీపై దృష్టి పెట్టాల‌ని.. ఆయ‌న మీరు అనుకుంటున్న ప్ర‌జాస్వామ్య వాది కాద‌ని వ్యాఖ్యానించ డం ద్వారా దేశంలో రాజ‌కీయ చిచ్చును ఘోరంగా ర‌గిల్చార‌నే చెప్పాలి.  సమస్యలపై మాట్లాడితే ప్రతిపక్ష నాయకులను జైళ్లలో వేస్తున్నారని ఆరోపించారు.

తన ఫోన్లో పెగాసస్ సాఫ్ట్వేర్ ఉందని, కాల్స్ రికార్డింగ్ చేస్తున్నారని.. ఫోన్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించినట్లు రాహుల్ గాంధీ బాంబు పేల్చారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 'లెర్నింగ్ టు లిజన్ ఇన్ ది 21 సెంచరీ' అనే లెక్చర్ సందర్భంగా రాహుల్ ఉపన్యసించారు. ప్రతిపక్షాలపై దొంగ కేసులు పెడుతున్నారని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉంద‌న్నారు.  ప్రజాస్వామ్యానికి అవసరమైన పార్లమెంట్, ప‌త్రికా స్వేచ్ఛ‌, న్యాయవ్యవస్థ తదితర అంశాలన్నింటినీ ప్రభుత్వం నిర్బంధిస్తోందన్నారు.  కాగా, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది.  "రాహుల్ గాంధీ మళ్లీ విదేశీ గడ్డకు వెళ్లి.. స్వదేశంలోని ప్రభుత్వంపై ఏడుస్తున్నారు. ఆయన మైండ్లోనే పెగాసస్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ గౌరవం మరింత పెరిగింది." అని కేంద్ర మంత్రి ఒకరు ఎదురు దాడి చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News